సమ్మె చేస్తున్న కార్మికుల పై కేసు పెట్టడం దుర్మార్గం..

– రత్నం రాజేందర్ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్
నవతెలంగాణ- గోవిందరావుపేట
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె చేస్తున్న కార్మికులపై సర్పంచి భర్త కేసు పెట్టడమే కాకుండా నాలుగు కిలోమీటర్లు నడిపిస్తూ పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లడం దుర్మార్గమైన చర్య అని పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ రత్నం రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు మల్టీపర్పస్ విధానం రద్దుచేసి కనీస వేతన చట్టం అమలు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. నేటి సమ్మెను సందర్శించిన రాజేందర్ కార్మికుల ఉద్దేశించి మాట్లాడారు. మండల కేంద్రానికి చెందిన పంచాయతీ సర్పంచ్ లావుడియా జోగానాయక్ సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు పోటీ కార్మికులను పెట్టి పని చేయించడమే కాకుండా సమ్మెలో ఉన్న కార్మికులు కూడా పనిచేయాలని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి గోవిందరావుపేట నుండి పసర పోలీస్ స్టేషన్ వరకు రానుపోను ఎనిమిది కిలోమీటర్లు నడిపిస్తూ తీసుకువెళ్లడం అత్యంత దుర్మార్గమైన చర్యగా వర్ణించారు. సర్పంచ్ భర్త నియంత పోకడలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 19000రు.లు చెల్లించాలి అని అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రఆకాంక్షలు నెరవేర్చడంలో పాలక ప్రభుత్వం విఫలం అయింది అని అన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న తరుణం లో గ్రామ పంచాయతీ సిబ్బంది ని విస్మరించి కార్మికుల వేతనాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి, అర్హులందరికీ ప్రమోషన్ కల్పించాలి, ఇన్సూరెన్స్ 10 లక్షల వరకు పెంచాలి. గ్రామ పంచాయతీ సిబ్బందికి పిఎఫ్ ,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  గ్రామపంచాయతీ కార్మికులు తండ కుమార్, సతీష్, ఉప్పలయ్య, విజయలక్ష్మి, నర్సమ్మ, జంపయ్య, సమ్మక్క, అంజమ్మ, సాంబయ్య, సోమనర్సయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.