ఉద్యోగులను బెదిరించడం తగదు

– పాత పెన్షన్‌ను పునరుద్ధరించాల్సిందే : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలంటూ నిరసన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ కేంద్ర ప్రభుత్వం బెదిరించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ, నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శతకోటీశ్వరులపై పన్ను విధించాలని కోరారు. దేశంలో పెరిగిన సంపదపై ప్రజలందరికీ హక్కు ఉంటుందని తెలిపారు. హక్కుల కోసం నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కనీ, దాన్ని కాలరాసే అధికారం ప్రభుత్వాలకు లేదని పేర్కొన్నారు. షేర్‌ మార్కెట్‌ జూదం లాంటిదనీ, దాని పెరుగుదల, తరుగుదలను కొన్ని కార్పొరేట్‌ శక్తులే నియంత్రిస్తాయని వివరించారు. ఇటీవల ఎల్‌ఐసీ డబ్బును అదానీ సంస్థలో పెట్టుబడి పెడితే నష్టాలొచ్చాయని గుర్తు చేశారు.