‘ధరణి’పై మాటలు చెప్తే సరిపోదు! పరిష్కరించాలి…

కాలానికనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ప్రభుత్వాలు వినియోగించుకోవాలి. ప్రజలకు మరింత సౌకర్యాలు, సేవలందించాలి. ఇందుకు భిన్నంగా ధరణి వ్యవస్థతో అవస్థలు సృష్టించారు. ధరణికి ముందు ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాకపోగా 2017-18లో భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా కొత్తగా సృష్టించబడిన అనేక సమస్యలు ధరణి ద్వారా పరిష్కారం కావడం లేదు. తమ వద్దకు వచ్చిన సుమారు 15వందల కేసులు పరిశీలిస్తేనే 20రకాల సమస్యలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. తహసీల్దార్‌, జిల్లా కలెక్టర్‌ స్థాయిలో ఎన్ని కేసులున్నాయో జులై 15లోగా తెలియజేయాలని, పరిష్కార దిశగా తీసుకునే చర్యలపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీని, సిసిఎల్‌ఎ కమిషనర్‌ని హైకోర్టు ఆదేశించింది. సుమారు పది లక్షలు పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని, 12లక్షలకు పైగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
రైతులు తమ కాళ్ల చెప్పులరిగేలా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ధరణి పోర్టల్‌ ఒక అద్భుతం అని ప్రచార్భాటాలు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం తాము అధికారంలోకి వస్తే ‘ధరణి’ని రద్దు చేస్తామని, బంగాళాఖాతంలో కలుపుతామని ప్రకటించింది. ఈ రెండు ధోరణులు రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప సమస్యల పరిష్కారానికి ఉపయోగపడవు. ధరణి లేకుంటే రైతుబంధు రాదని కేసీఆర్‌ మాట్లాడటం ఓట్‌ బ్యాంకు రాజకీయాల కోసమే. రైతుబంధు ప్రారంభమయ్యే 2018 నాటికి ధరణి లేనేలేదు. అంతకుముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీలు చేసినప్పుడు కూడా ధరణి లేకుండానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌ సర్వే చేపడతామని ప్రకటించినప్పుడు రైతులు, భూ యజమానులు సంతోషించారు. సర్వే నెంబర్ల ప్రకారం క్షేత్రస్థాయిలో సర్వే చేసి భూ హద్దులు నిర్ణయిస్తారని రైతులు భావించారు. నిజాం కాలంలో 1923 సంవత్సరం నుండి 1953 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో భూకమతాల వారిగా భౌతికంగా సర్వే చేసి భూ హద్దు రాళ్లు పాతారు. నెంబర్లు కేటాయించారు. ‘నక్షా’ (మ్యాపు)లు రూపొందించారు. అప్పటికి ఎటువంటి శాటిలైట్‌ వ్యవస్థ, డిజిటల్‌ పరికరాలు ఊహలో కూడా లేనికాలంలో మాన్యువల్‌గా అద్భుతమైన కచ్చితత్వంతో కూడిన ‘నక్షా’లు భూ కమతాల వారిగా రూపొందించారు. గ్రామ పటాలు తయారు చేశారు. కొలతలు, స్కెలింగ్‌ నేటికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మూడంచెల వ్యవస్థలో రికార్డులు భద్రపరిచారు. జిల్లా, తాలూకా, గ్రామం, పట్టాదారు పేర్లు, భూ విస్తీర్ణం, భూ స్వభావం రికార్డు చేశారు. ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, బంజర, పోరంబోకు, గైరాన్‌ భూములు, గ్రామ కంఠం, సర్ఫేఖాస్‌ తదితర అనేక భూముల వివరాలు పొందుపరిచారు.
ఈ 8, 10 దశాబ్దాల కాలంలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యంగా భూ ఖండాల విభజన జరిగింది. వారసత్వ పంపకాలు, క్రయ విక్రయాలు, ప్రభుత్వ భూముల అసైన్‌మెంట్‌ వంటి అనేక మార్పులు వచ్చాయి. రెవెన్యూ రికార్డుల్లోని సర్వే నెంబర్లలో బై నెంబర్లు వేసి విభజించారు. కానీ బై నెంబర్లు, విభజన జరిగిన ప్రకారం ‘నక్షా’ (టిపన్‌)లో మార్పులు చేయలేదు. ఎక్కువ శాతం హద్దు రాళ్లు చెదిరిపోయాయి. క్షేత్ర స్థాయిలో భూ భౌతిక సర్వే నిర్వహించి, కాగితాల్లో రికార్డ్‌ అయిన సర్వే, బై నెంబర్లకు అనుగుణంగా హద్దు రాళ్ళు ఏర్పాటు చేస్తారని, ‘నక్షా’లో తగు మార్పులు చేస్తారని తెలంగాణ రైతాంగం, భూ యజమానులు ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 2017లో భూ భౌతిక సర్వేకు బదులు భూ రికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. పట్టాదారు పేర్లలో తప్పులు, ఇంటి పేర్లలో తప్పులు, తండ్రి, భర్త పేరులో తప్పులు, భూ విస్తీర్ణంలో తప్పులు, భూ స్వభావంలో తప్పులు ఇలా అనేక తప్పులు చేసి రైతులకు వెతలు మిగిల్చింది. తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగం సృష్టించిన తప్పులను సరి చేయకుండా 2020లో పట్టాదారు పాస్‌బుక్‌, భూ యజమాన్య హక్కుల సవరణ చట్టం తీసుకొచ్చింది. కౌలుదారు ‘కాలమ్‌’తో సహా కొత్త పట్టాదారు పాసుబుక్‌లో అనేక ‘కాలమ్స్‌’ ఎత్తివేశారు. కౌలు రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కౌలు రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారం పొందడం లేదు. బీమా సౌకర్యం కల్పించబడడం లేదు. పంటల పెట్టుబడి పతకమైన రైతుబంధు భూ యజమానులకే చెల్లించబడుతున్నది. డిజిటల్‌ రికార్డులు మాత్రమే ఉండే విధంగా సవరణలు చేసింది. ధరణి పోర్టల్‌ తీసుకువచ్చింది. ఆఫ్‌ లైన్‌ (భౌతిక) రికార్డుల కన్నా ఆన్‌లైన్‌ రికార్డులు చాలా భద్రంగా ఉంటాయి అన్నట్లుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. సైబర్‌ దాడులు, ఆన్‌లైన్‌లో డేటా చోరీలు అనేకం చూస్తున్నాం. పైగా ధరణిని ప్రయివేట్‌ కంపెనీ నిర్వహిస్తున్నది. గతంలో మూడు స్థాయిల్లో రికార్డులు భద్రపర్చేవారు. తీవ్రవాద దాడులు, వరద లాంటి పకృతి వైపరీత్యాలు జరిగిన ఒకచోట ధ్వంసమైన ఇంకోచోట భద్రంగా ఉండేది, ఇప్పుడు అలా కాదు.
రూల్‌ ఆఫ్‌ రైట్‌ (ఆర్‌ఓఆర్‌) చట్టం-1971 చాలా స్పష్టమైన గైడ్‌లైన్స్‌తో ఉన్నది. అర్థం పర్థం లేని పనికిరాని చట్టం 2020 ఆర్‌ఓఆర్‌ సవరణ చట్టం. ఒక చట్టం చేసే ముందు అనేక కోణాల్లో పరిశీలించాలి. ముఖ్యంగా భూ చట్టాలకు అనేకమైన, న్యాయపరమైన చిక్కులుంటాయి. రైతు సంఘాలను, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులను, భూ పరిపాలన నిపుణులు, న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని చట్టం తీసుకురావలసింది. కానీ అన్ని ఆయనే (ముఖ్యమంత్రి) చేసినట్లు చెబుతూ ఉంటాడు. అందుకే ఇన్ని సమస్యలు వస్తున్నాయేమో. ఆర్‌ఓఆర్‌ సవరణ చట్టం ద్వారా ఉనికిలోకి వచ్చిన డిజిటల్‌ రికార్డుల ‘ధరణి’ పోర్టల్‌ అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారంగా చెప్పబడింది. కానీ అనేక సమస్యల పరిష్కారానికి ధరణిలో ఆకాశమే లేదు. రిజిస్ట్రేషన్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే డబ్బులు రిటన్‌ రావడం లేదు. పాస్‌బుక్‌లు రెండు, మూడు నెలల నుండి రావడం లేదు. పాస్‌బుక్‌లు రాకుంటే ఎవరిని అడగాలనేది స్పష్టత లేదు. విల్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌కు ఆప్షన్‌ లేదు. ఒక కుటుంబంలో ముగ్గురు వారసులుంటే ఏ ఒక్కరో విరాసత్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంటే వారికే వారసత్వ హక్కులు కల్పించబడతాయి. విచారణకు అవకాశం లేదు. ధరణిలో క్రమంగా ఒక్కొక్కటి పెంచుతూ 35మాడ్యూల్స్‌ చేర్చారు. బాధితులు పెట్టుకున్న పిటిషన్‌ అంగీకరించబడిందా లేదా రిజెక్ట్‌ చేశారా? రిజెక్ట్‌ చేస్తే కారణమేంటి అనేది తెలపడం లేదు. ఎవరిని అడగాలి, ఎవరు జవాబుదారో తెలియదు. నాలా కన్వర్షన్‌కు వెరిఫికేషన్‌ అవసరం లేదు. రిజిస్టర్‌ సర్టిఫై కాఫీ ఇవ్వడం లేదు. మిస్సింగ్‌ సర్వే నెంబర్లు చేర్చడానికి సిసిఎల్‌ఏ ఆమోదించాలి. ధరణికి ముందు అనేక సర్వే నెంబర్లు మిస్సయ్యాయి. పాత రికార్డులు ప్రకారం మిస్‌ అయిన సర్వే నెంబర్లు అన్ని చేర్చవచ్చును. కానీ వేలకొద్దీ అప్లికేషన్స్‌ వస్తున్నప్పటికీ పెండింగ్‌లో పెడుతున్నారు. ధరణి యాప్‌లో చెప్పుకోదగినది ఏమైన ఉందంటే అది ధరణిలో ల్యాండ్‌ నమోదై ఉంటే స్లాట్‌ బుక్‌ చేసుకొని వెంటనే అమ్మకాలు, కొనుగోలు చేసుకోవచ్చు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్లను సమన్వయం చేసి రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే ముటేషన్‌ కావడం ఒక్కటే. అది కూడా పేదల కంటే పెద్దలకు ఎక్కువగా ఉపయోగపడేది. ధరణికి ముందు ముటేషన్‌ కోసం తహసీల్దార్‌ ఆఫీస్‌ చుట్టూ తిరగాల్సి వచ్చేది. పాస్‌బుక్‌ కావాలంటే రూ.వెయ్యి, రెండువేలు కిందిస్థాయి సిబ్బంది తీసుకొని పాస్‌బుక్‌ ఇచ్చేవారు. ఇప్పుడు అధికారికంగానే ఎకరాకు రూ.2500 ముటేషన్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నాలుగెకరాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే రూ.10వేలు ముటేషన్‌ ఛార్జీల కింద ప్రభుత్వానికి చెల్లించాలి. ముటేషన్‌ ఫీజు మాత్రమే కాదు, దరఖాస్తుదారులు పెండింగ్‌ సమస్యలన్నిటికీ వేలల్లో ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది. సమస్య సృష్టించింది ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం. ఫీజులు చెల్లిస్తున్నది మాత్రం రైతులు. గ్రీవెన్స్‌ రోజైన సోమవారం కలెక్టర్లకు వస్తున్న దరఖాస్తుల్లో భూ సమస్యలకు సంబంధించినవే అధికం.
అనేక సమస్యలపై వేసిన మంత్రివర్గ సబ్‌ కమిటీల లాగానే ధరణి, భూ సమస్యలపై వేసిన మంత్రివర్గ ఉప సంఘం కూడా ఉన్నది. ప్రారంభంలో కొన్ని మాడ్యూల్స్‌, ఆప్షన్స్‌ ధరణిలో చేర్చడం కోసం సూచనలు చేసి వదిలేశారు. ధరణికి ముందున్న రెవెన్యూ రికార్డులు పరిశీలించి, రికార్డులు అఫ్‌డేట్‌ చేసి ప్రభుత్వమే సమస్యలన్నీ పరిష్కరించాలి. బాధితుల వివిధ రకాల దరఖాస్తులను ఫీజులు లేకుండా నిర్దిష్ట పిరియడ్‌లో పరిష్కరించాలి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేవరకు తహసీల్దార్లకు అధికారమివ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఇవి చేసిన తర్వాతే ధరణి గురించి మాట్లాడితే బాగుంటుందేమో! సెల్‌:9490098857
గీట్ల ముకుందరెడ్డి