దశాబ్ది ఉత్సవాలలో ఆర్టీసి కార్మికుల కోసం ఒక్కమాట ప్రస్తావించకపోవడం బాధాకరం

– సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కి  ఆర్ టి సి జెఏసి వినతి పత్రం
నవతెలంగాణ – సిద్దిపేట
దశాబ్ది ఉత్సవాల సందర్భంలోనైనా ఆర్టీసి గురించి, ఆర్టీసి కార్మికులు, వారి కుటుంబాల గురించి ఒక్కమాట ప్రస్తావించకపోవడం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడంతో 44 వేల మంది కార్మికుల కుటుంబాలు తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారని ఆర్ టి సి మెదక్ రీజియన్ జాయింటు  యాక్షన్ కమిటీ రీజినల్ కార్యదర్శి శేషు తెలిపారు.  ఆర్టీసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోయి, పరిష్కారం చేయాలని కోరుతూ బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం జేఏసీ ఆధ్వర్యంలో అందించారు. అనంతరం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ..   తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నమని, ముసలి వారికి, పేదవారికి అండగా వుండి రూ. 2016/-లు ఆసరా పెన్షన్ ను అందిస్తున్న ప్రభుత్వం, ఆర్టీసి కార్మికులకు 2017 నుండి ఇంతవరకు ఒక్క రూపాయి వేతనం పెంచకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారి, అవసరాల కోసం ప్రైవేటు అప్పులు చేస్తున్నామని తెలిపారు.  ప్రభుత్వం నుండి అదనపు ఆర్థిక సహాయం ఇవ్వకపోగా, కార్మికులకు సంబంధించిన రూ.3700 కోట్లు యాజమాన్యం వాడుకొని, కార్మికుల భవిష్యత్ జీవితం పట్ల భయాన్ని సృష్టిస్తున్నారని ఆనేదన వ్యక్తం చేశారు.  రాజ్యాంగ పరిధిలో ఏర్పడి పని చేస్తున్న ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, ప్రజాస్వామ్య వాతావరణం కల్పించి, ఆర్టీసిలో కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించాలని, ప్రజల అవసరాల మేరకు ఆర్టీసి బస్సు లు పెంచాలని, కొత్తగా నియామకాలు చేపట్టాలని,  కార్మికుల చేత నిర్వహించుకుంటున్న సిసిఎస్ సంస్థకు ఇవ్వవలసిన డబ్బులు ఆర్టీసి యాజమాన్యం తక్షణమే చెల్లించాలని, నెలవారీ చేస్తున్న రికవరీలను క్రమం తప్పకుండా చెల్లించాలని,   2021లో విడుదల చేసిన మార్గదర్శకాలను సవరించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 2021 వేతన ఒప్పందాలను వెంటనే చేయాలని,  ఆర్టీసీలను నిర్వీర్యం చేసేలా టూరిస్టు పర్మిట్ గైడ్ లైన్స్ విద్యుత్ వాహనాలకు ఫీజు లేకుండా పర్మిట్ ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని,  136 నెలల డిఎ ఆలవెన్సు  తక్షణమే చెల్లించాలని, సర్వీసులో వుండి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలలోని పిల్లలు, మెడికల్ అసెట్ అయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించాలని, కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించబడ్డ వారికి వైద్యం, ఈ ఎస్ ఐ సౌకర్యాలు కల్పించాలని, కార్మికులపై పని భారం తగ్గించి, అన్ని రకాల వేధింపులు ఆపాలేని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి ఎల్ రావు, కే డి రెడ్డి, డి వై రెడ్డి, రాజయ్య, కనకయ్య, మల్లేశం, రవి, తదితరులు పాల్గొన్నారు.