ఎస్‌ఏ పదోన్నతికి టెట్‌ ఉత్తీర్ణత ఉండాలనడం విచారకరం

– తీర్పును పున:సమీక్షించాలి : టీఎస్‌యూటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పేపర్‌-2 ఉత్తీర్ణులైన వారికే స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పదోన్నతులు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం విచారకరమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. ఆ తీర్పును పున్ణసమీక్షంచాలని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2010, ఆగస్టు 23కి ముందే సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్‌ ఉత్తీర్ణత మినహాయించబడిందని తెలిపారు. ఆ తర్వాత ప్రత్యక్ష నియామకం ద్వారా సర్వీసులో చేరే వారికి మాత్రమే టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి చేయబడిందని స్పష్టం చేశారు. అదే ఉద్దేశంతో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుడు ఎవరూ టెట్‌ రాయలేదని పేర్కొన్నారు. హఠాత్తుగా టెట్‌ ఉత్తీర్ణులైతేనే పదోన్నతి అనటం పదోన్నతుల కోసం ఎనిమిదేండ్లుగా ఎదురు చూస్తున్న సీనియర్‌ టీచర్లకు ఆశనీపాతమైందని తెలిపారు. పోస్టులకు సరిపడా అభ్యర్థులు కూడా లభ్యమయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై పున్ణసమీక్షకు అప్పీల్‌ చేయాలని వారు కోరారు.