మత్స్య పరిశ్రమ సంక్షేమంపై మ్యానిఫెస్టోలో చేర్చాలి

On Fisheries Welfare should be included in the manifesto– రూ.5 వేల కోట్లు కేటాయించాలి: అఖిలభారత మత్స్యకారులు, మత్స్య కార్మిక సమాఖ్య కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ – ముషీరాబాద్‌
మత్స్యకారుల సంక్షేమానికి ప్రతి బడ్జెట్‌లోనూ రూ.5వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తామని హామీ ఇస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాలని మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో గెలిచిన చైర్మెన్‌ కొప్పు పద్మ, వైస్‌ చైర్మెన్‌ బైరి వినోద్‌కుమార్‌, డైరెక్టర్లకు సోమవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మత్స్యకారులందరూ సంఘటితంగా ఉండి.. చట్టసభల్లో సీట్లు.. బడ్జెట్‌లో నిధుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 3న మత్స్య కారుల సమస్యలపై చలో మత్స్య భవన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నరసింహ, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గాలి సత్యనారాయణ, గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంగలి పల్లి శంకర్‌, కైరం కొండ నర్సింగరావులు పూస సత్యనారాయణ, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కరేల్లి లలిత, మామిండ్ల జగదీష్‌, కాడబోయిన అరుణ, కట్ట లింగం, పూస వరలక్ష్మి పాల్గొన్నారు.