దీప్తిని చంపింది చెల్లెలే..

– వీడిన కోరుట్ల మర్డర్‌ కేసు
– చెల్లెలు చందన, ఆమె ప్రియుడే హంతకులు
– అక్కకు వొడ్కా తాగించి.. డబ్బు, నగలతో పారియేందుకు పథకం
– ప్లాన్‌ వికటించడంతో అక్కను చంపిన వైనం
– మద్యం తాగి చనిపోయిందని నమ్మించే యత్నం
– ముంబయికి పారిపోయేందుకు పయనం
– నిందితులను అరెస్టు చేసి.. కేసును ఛేదించిన పోలీసులు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / జగిత్యాల
జగిత్యాల జిల్లా కోరుట్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దీప్తి మర్డర్‌ కేసు మిస్టరీ వీడింది. ఆమె చెల్లెలు చందననే తన ప్రియుడితో కలిసి చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రియుడితో కలిసి ఇంట్లో నగదు, నగలు పట్టుకుని పారిపోయేందుకు సినీఫక్కీలో వేసిన ప్లాన్‌ కాస్త మర్డర్‌ చేసేవరకూ వెళ్లి ప్రేమికులిద్దరూ కటకటాలపాలయ్యారు. ముంబయి వెళ్లేందుకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌-బాల్కొండ రోడ్డుని దాబాలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు దీప్తి, చందన, కొడుకు ఉన్నారు. దీప్తి వర్క్‌ఫ్రం హోంలో భాగంగా ఇంటి నుంచే స్టాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తోంది. రెండో కూతురు బీటెక్‌ చదివింది. హైదరాబాద్‌ మల్లారెడ్డి కాలేజీలో బీటెక్‌ చదువుతున్న చందన, నెల్లూరుకు చెందిన ఉమర్‌షేక్‌ సుల్తాన్‌ ప్రేమించుకున్నారు. చదువు పూర్తయి ఇంటి వద్దనే ఉంటున్న చందనను ఉమర్‌ తరచూ కోరుట్లకు వచ్చి కలుస్తుండేవాడు. గత నెల 19న కూడా కోరుట్లకు వచ్చిన ఉమర్‌తో ‘మన పెండ్లికి ఇంట్లో ఒప్పుకోరు. బయటకి వెళ్లి పెండ్లి చేసుకుందాం’ అని చందన చెప్పింది. జాబ్‌ లేకుండా ఇద్దరం ఎలా బతుకుతాం.. సెటిల్‌ అయ్యాక పెండ్లి చేసుకుందామని అతని చెబితే.. ఎలాగైనా సరే పెండ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. దీంతో విషయం వాట్సప్‌కాల్‌ ద్వారా ఉమర్‌ తన కుటుంబ సభ్యులు తల్లి సయ్యద్‌ అలియా మహబూబ్‌, చెల్లి ఫాతిమా, తన స్నేహితుడు హఫీజ్‌కు తెలిపాడు. వారు కూడా చందనతో మాట్లాడారు. రెండ్రోజుల తరువాత చందన తన ప్రియుడికి ఫోన్‌ చేసి ఇంట్లో బంగారం, డబ్బులు ఉన్నాయని, అవి తీసుకెళ్లి పెండ్లి చేసుకుని బతుకుదామని చెప్పింది. ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం ఎదురుచూస్తున్న చందన గత నెల 28న తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్తున్న విషయాన్ని ప్రియుడికి తెలిపింది. ఆ రోజు ఉదయం 11గంటలకు ఉమర్‌ కోరుట్లకు వచ్చాడు. చందన, ఆమె అక్క దీప్తితో కలిసి వొడ్కా తాగారు. కొంత సేపటికి ఉమర్‌ ప్లాన్‌లో భాగంగా బయటకు వెళ్లాడు. మద్యం మత్తులో దీప్తి పడుకోగానే.. చందన రాత్రి 2గంటల సమయంలో ఉమర్‌ను రమ్మని మెసేజ్‌ చేసింది. చందన ఇంటి వెనకాల నుంచి ఉమర్‌తో కలిసి బీరువాలోని బంగారు ఆభరణాలు, డబ్బులు సర్దుతుండగా అలికిడి అయింది. మెళకువ వచ్చిన దీప్తి ‘నువ్వు ఏం చేస్తున్నావే’ అంటూ అరుస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఏం చేయాలో తోచక దీప్తి ముక్కు, మూతికి ప్లాస్టర్‌ వేసి, చేతులను చున్నీతో కట్టేశారు. ఊపిరి ఆడక దీప్తి చనిపోవడంతో ప్లాస్టర్‌ తీసి, కట్టు విప్పారు. 70తులాల బంగారు ఆభరణాలు, రూ.1.25లక్షలు తీసుకుని పారిపోయారు. మరుసటి రోజు 29న ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న దీప్తిని చూసిన బోరున విలపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ‘అక్క అతిగా మద్యం తాగి చనిపోయింది’ అంటూ చందన వాయిస్‌ మెసేజ్‌ పెట్టి.. పోలీసులకు దొరక్కుండా ప్రియుడితో కలిసి పలుచోట్ల తిరిగింది.జగిత్యాల ఎస్పీ భాస్కర్‌ ఆదేశాల మేరకు మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదు పోలీసు బృందాలు విచారణ ప్రారంభించాయి. హత్య జరిగిన నాలుగు రోజుల తరువాత నమ్మదగిన సమాచారం మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల జాడ తెలుసుకున్నారు.ముంబయి వెళ్లేందుకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌-బాల్కొండ రోడ్డులోని దాబాలో ఉన్న చందన, ఉమర్‌, అతని కుటుంబ సభ్యులు, స్నేహి తుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. చందన(ఏ1), ఉమర్‌షేక్‌ సుల్తాన్‌(ఏ2), సయ్యద్‌ అలియా మహబూబ్‌(ఏ3), షేక్‌ అసియా ఫాతిమా (ఏ4), హఫీజ్‌(ఏ5)గా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 70తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష, సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, కోరుట్ల సీఐ ప్రవీణ్‌ కుమార్‌, కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్‌ ఎస్‌ఐలు కిరణ్‌, చిరంజీవి, కిరణ్‌ కుమార్‌, సిబ్బందిని ఎస్పీ భాస్కర్‌ అభినందించారు.