– కాంగ్రెస్‌తో చర్చలు జరుగుతున్నాయి..
– బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే…
– ఉద్యమకారులంతా ఏకం కావాలి : బీజేపీ బహిష్కృత నేత యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే స్పష్టతనిస్తానని బీజేపీ బహిష్కృత నేత యెన్నెం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతున్నదని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేననీ, బీజేపీ బీఆర్‌ఎస్‌ను ఓడించడం ఒక కల అని తెలిపారు. కేవలం కార్యకర్తలను మభ్యపెడుతూ బీజేపీ కాలం గడుపుతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ శ్రేణులు అబద్ధాల వెంట పరుగులు తీయడం మానుకోవాలని సూచించారు. మునుగోడులో గెలిచే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి మోసం చేశారని విమర్శించారు. ఐదు సార్లు గెలిచిన వ్యక్తిని కింద కూర్చొబెట్టి వార్డు మెంబర్ కాని వ్యక్తి ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో బీజేపీలో పాఠాలు నేర్పుతారని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ భవిష్యత్తును నిర్ణయించుకోవాలని సూచించారు. బీజేపీ ఏనాడైనా పేదల అంశంపై పోరాడిందా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్, వివేక్, రాజగోపాల్ రెడ్డి, రవీంద్రనాయక్ వంటి నేతలందరు బయటికి వస్తే ఒకే జెండా కింద పని చేద్దామని ఆయన ఆహ్వానించారు. తామంతా కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని యెన్నెం తెలిపారు. కాంగ్రెస్‌కు మాటిచ్చి ఈటల, రాజగోపాల్ రెడ్డి, రవీంద్రనాయక్, వివేక్ మాట తప్పారని తెలిపారు.