డల్లాస్‌ కాదు ఇది కల్లాస్‌ నగరం

– నాలాల కబ్జా వల్లే హైదరాబాద్‌ నగరం మునక
– వరద బాధిత కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలి
– కాంగ్రెస్‌ నాయకుల డిమాండ్‌
– గన్‌ పార్క్‌ నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ
– కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన పలువురి అరెస్ట్‌
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారని, హైదరాబాద్‌ డల్లాస్‌ కాదు.. కల్లాస్‌ నగరంలా మారిందని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. నాలాల కబ్జా వల్లే నగరం వర్షాలకు మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు పెద్దఎత్తున శుక్రవారం హైదరాబాద్‌ గన్‌పార్క్‌ నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముట్టడికి యత్నించగా.. నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన నాయకుల పట్ల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అమర్యాదగా ప్రవర్తించారని కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి లేని పేద కుటుంబాలకు, కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. సీనియర్‌ నాయకులు వి.హనుమంతరావు, మల్లు రవి, రాములు నాయక్‌ మాట్లాడుతూ.. వరదల్లో నీట మునిగిన ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ నాయకులు అంజన్‌ కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను డల్లాస్‌ నగరంగా మారుస్తామన్న సీఎం కేసీఆర్‌ వరదలు, గుంతల రోడ్ల నగరంగా మార్చారని విమర్శించారు. ఈ విషయమై కమిషనర్‌ను అడిగితే సీరియస్‌గా వెళ్లిపోయారన్నారు. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఉప్పల్‌ కార్పొరేటర్‌ రజిత పరమేశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. సముద్రాన్ని హైదరాబాద్‌ నగరానికి తీసుకొచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ సర్కార్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎస్‌ఎన్‌డీపీ ఆగిపోయిందని, ముంపు ప్రాంతాల్లో ఫుడ్‌ ప్యాకెట్స్‌ ప్రభుత్వం పంపలేదన్నారు. రోజువారి కూలీలకు వర్షం కారణంగా పని లేకుండా పోయిందని, వారికి ఉపాధి కల్పించాలని కోరారు. హైదరాబాద్‌ నగరాన్ని డల్లాస్‌ నగరంగా మారుస్తామన్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కల్లాస్‌ నగరంగా మార్చిందని ఎద్దేవా చేశారు. నాలాల కబ్జా వల్లే నగరం చిన్న చిన్న వర్షాలకే నీట మునుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ అధ్యక్షులు అనిల్‌ కుమార్‌యాదవ్‌ మాట్లాడారు.