ఎగిరి దంచినా ఎగరక దంచినా అంతే కూలి

రోజుకు నిర్ధిష్టమైన కూలి ఉంటే మనిషికి రోజులెక్కనే చెల్లిస్తరు. అయితే కొందరు నిదానంగా చేసేంత పని మాత్రమే చేస్తరు. కానీ కొందరు మేనేజ్‌మెంట్ల కంట్ల పడేటందుకు ఎక్కువ ఎక్కువ చేస్తున్నట్టు ప్రవర్తిస్తరు. అలాంటప్పుడు వాల్లకు ‘ఎగిరెగిరి దంచినా అంతే కూలి ఎగురక దంచినా అంతే కూలి’ అనే సామెత వాడుతరు. దంచుడు అంటే వడ్లు దంచుడు అన్నట్లు. ఎన్నట వడ్లు రోకట్ల పోసి కుందెన పెట్టి దంచుతేనే బియ్యం తయారైతయి. దంచడానికి రోకలిపైకి లేవాలె. అంతే గాని మనిషి ఎగిరెగిరి పడకూడదు. ఎంత చేసినా ఇచ్చేంత కూలి అని అంటరు. ఇసోంటోల్లను ‘అబ్బో బగ్గ శానత్తం చెయ్యవడితివి’ అని అంటరు. ఎంత నీటుకం చేసి ఎగిరినా అంతే అన్న చందంగా అన్న అర్ధంలోనైనేతే… ‘ఎగిరి పోయిన దూది ఎంత సేపు గాలిల వుంటది’ అంటరు. గాలిల లేసిన దూది పింజం నేల మీద పడుట ఖాయం అనేది పక్కా అనే అర్థంలో వాడుతరు.
ఎక్కడైనా భయ భక్తులు మనుషులకు ఉండాలనుకుంటరు. గింత సుత తప్పుచేస్తే ఎట్ల పై అధికారులు లేదా ఇంట్ల పెద్దవాల్లు కోపానికి వస్తరు అనే లోపల ఇంత వుంటది. అట్లాంటిది ఏం లేనోల్లను ‘భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టిందట’ అంటరు. నిజానికి ఊరి కోడిపెట్ట గుడ్లకు వచ్చినంక ఇంట్లో రోజూ ఒక దగ్గర గుడ్డు పట్టిపోతది. కాని బజార్ల గుడ్డు పెట్టిన దానిని భయం లేదని అర్ధంలో వాడుతరు. ఏది ఏమైనా అన్నీ అందరికీ తెలియవు. కొందిరికి కొత్త పని చేస్తామంటే పైసలు వుండవు, మరికొందరికి పైసలు పుష్కలంగ ఉంటయి. కొత్త పని మొదలు పెడదామని వుండది. ఇటువంటి సందర్భంలో ‘ఎద్దున్నోనికి బుద్ది వుండది, బుద్ది ఉన్నోనికి ఎద్దు ఉండది’ అంటరు. ఎద్దు ఎందుకు అంటే వ్యయసాయంలో పొలం దున్నేందుకు అయితే దున్నుదామంటే ఆయిన ఎడ్లు లేవు. ఈ సందర్భంలో జానపదులు కరెక్ట్‌గా విషయానికి ఒక్క వాక్యంతో అత్తుక పోయే సామెతలను సృజించారు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479