జమిలి ఎన్నికలు మంచిదే…

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జమిలి ఎన్నికల నిర్ణయం మంచిదేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. అయితే దీనిపై లోతుగా చర్చ జరగాలని 2018లోనే తాము లా కమిషన్‌కు చెప్పామని వివరించారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయడం ఆశ్చర్యకరమని అన్నారు. ఆ కమిటీలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులే ఉన్నారనీ, దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరు కూడా లేరని ఆక్షేపించారు. జమిలి ఎన్నికలపై ఇప్పటికే రిపోర్ట్‌ రెడీ అయ్యి ఉందా… ఇప్పుడు వేసిన కమిటీ నామ్‌ కే వాస్తే నేనా…అనే అనుమానాలు వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో సభ్యుల సంఖ్య పెంచాలని ఉందనీ, కానీ ఇప్పటి వరకు దానికి అతీగతీ లేదన్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు పెట్టి ప్రధాని మోడీ దేశాన్ని గందరగోళంలోకి నెట్టారని విమర్శించారు.