జమిలి పోగవ్వాలి

Jamili should be pouredజమిలి పోగు కథలు
రచన : రుబీనా పర్వీన్‌
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
అనాదిగా వస్తున్న పురుషాధిక్య సమాజంలో మహిళల పరిధి చాలా చిన్నదిగా చేయబడింది. ఆలోచన, జీవనం, జీవన విధానం, వత్తి, కోరికలు, వేషాధారణ, ఆహారం… అన్ని ఈ పరిధిలోనే ఉంటాయి. ఎల్లలు దాటని ఆ స్త్రీలని వెలికి తీసి మహా ప్రపంచాన్ని చూపించిన, చూపిస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. స్త్రీ అణిచివేతను వ్యతిరేకిస్తూ వచ్చిన ఉద్యమాలు ఎన్నో. ప్రాచీన కాలం నుండి నేటి ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కాలం వరకు చాలానే వచ్చాయి. అదేవిధంగా దీనికి సమాంతరంగా పురుషాధిక్య భావజాలం కూడా నూతన దారులను వెతుక్కుంటూ తనదైన ఆదిపత్య ధోరణిని, దాష్టికాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నది. ఈ రెండి మధ్య ఘర్షణను అక్షరీకరించటం జరుగుతూనే ఉన్నది. రుబీనా పర్వీన్‌ ఒక ఆంత్రప్రెన్యూర్‌ గా ఎదుగుతున్న క్రమంలో తను, తన లాంటి మహిళా ఆంత్రప్రెన్యూర్‌ల జీవితాలను కథలుగా రాశారు. ఆంత్రప్రెన్యూర్‌ గానే కాదు తాను చూసిన మహిళా జీవితాలను కూడా కథలుగా రాశారు. సమాన స్థాయిల్లో, హోదాల్లో ఉన్న స్త్రీ, పురుషుల మధ్య పురుషాధిక్యత ఎలా ప్రదర్శితమవుతుందో రూబీన పర్వీన్‌ ‘వన్‌ పర్సన్‌ కంపెనీ’ కథలో చూయిస్తారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్న కోణంలో కూడా కథను ప్రారంభిస్తూ స్వేచ్ఛాయుత వాయువులను తీసుకునే వరకు నడిపిస్తారు. చాలా మంది ముస్లిం స్త్రీలకు ఆచార, సాంప్రదాయాల చైతన్యం కూడా ఉండదు. మగవారు చెప్పిందే సంప్రదాయం అదే ఆచారం. కేవలం తలాక్‌ మాత్రమే ఉంటుందనుకుంటారు. దానికే లొంగి ఉంటారు. భార్య కూడా తనను వేధించే, బాధించే భర్తను వదిలించుకునే జెండర్‌ చైతన్యమే ‘ఖులా’ తలాక్‌ ఏ విధంగా తీసుకుంటారో అంతకు సమాన స్థాయిలో ఖులా కనిపించకపోవచ్చు. కానీ జుబేదా పంచాయతీ ముందుకు వచ్చి ‘ఇయ్యాల ఈయనకి పనికిరాలే, ఫాతిమాను తెచ్చిండు. రేపు ఫాతిమా మొకం కొడతది, ఇంకొకతెను తెస్తాడు. నేను వగ అమ్మ కడుపులో పుట్టిన. నాకూ చీము, నెత్తురు ఉన్నది. బతికే ధైర్యం ఉన్నది. పెండ్లాం ముంగట ఇంకొకతిని దెచ్చుకున్నోనితో నేను కాపురం ఎందుకు జెయ్యాలె? ప్రతి నిమిషం పాణం పీక్కుదినే మగడు పూట పూటకు అనుమానంతో పిప్పి జేసే మగడు నాకొద్దు. సొక్కంగ దమ్ము తీసుకునేటందుకు నాకు ఖులా చేయండి’. ఈ వాక్యాలతో ముస్లిం మహిళ ఒక కెరటంలా కనిపిస్తుంది. ఇది బలమైన ముగింపు. బుర్ఖా కథలో వైద్యురాలిగా పనిచేస్తూ బుర్ఖా ధరించి సేవలందిస్తున్న మెహర్‌ కి వింత అనుభవం ఎదురవుతుంది. వెనుకటి సంధి గ్రామాలలో బురఖా ధరించే సాంప్రదాయం ముస్లిం కుటుంబాల్లో తక్కువ. బుర్ఖా బదులు తెల్లటి చాదర్‌ ధరించేవాళ్లు. సమాజం ముందుకు పోతున్న కొద్ది సాంప్రదాయత కూడా ముందుకెళ్ళింది. అందులో భాగంగానే గ్రామీణ ముస్లిం మహిళా సమాజం కూడా హిజాబ్లోకి వచ్చింది. ధనిక ముస్లిం మహిళలు హిజాబ్‌ పాటించడం తక్కువే. అలాగే నిరుపేదల్లో కూడా తక్కువే. మధ్య, దిగువ మధ్య తరగతి ముస్లింలు తు.చ. తప్పకుండా పాటించే సాంప్రదాయం. గ్రామ వాతావరణం లో పెరిగిన మెహర్‌ బురఖాను ధరించి ఎదుర్కొన్న ఇబ్బందిని రాశారు. బుర్ఖా ధరించిన మేహర్‌ పొలాల గట్లెంబడి వెళుతున్నప్పుడు నల్లగొడ్డు, తురక దయ్యంతో పోల్చి చూయించిన ఘటనను, చివరికి బుర్ఖా ను వదిలిపెట్టడం కథలోని బలమైన అంశం. బుర్ఖా ధరించడం ధరించకపోవటం వారి వారి చైతన్య స్థాయినో, ఆచారాల పట్ల నిబద్ధతనో చూపుతున్నదే కానీ అందునుండి స్వేచ్ఛను కోరుకుంటుంది మెహర్‌. ప్రపంచీకరణ విస్తరిస్తున్న కొద్దీ మానవ సంబంధాలు, బంధాలు దూరమై పోతున్నాయి. మనీ చుట్టూ మానవ సంబంధాలు గట్టి పడుతున్నాయి. వాటి వల్ల మానసిక ఒత్తుడులు, సమస్యలు పెరుగుతున్నాయి. సమాజ పోకడల వల్ల ఏర్పడిన మానసిక రుగ్మతల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న మానవ సంక్షోభాన్ని చూస్తున్నాం. ఇట్లా స్కిజో పీనిక్‌కి గురి అయిన, బాధపడుతున్న మనుషుల్ని బాగు చేసుకోనంత దూరం మనుషులు, సమాజం ఉండడం కొంచెం ఆలోచించతగినది.
లక్ష్మీ పుట్టింది అని అమ్మాయి పుట్టినందుకు సంబర పడుతూ ఇంకోవైపు అమ్మాయి పుట్టటం ఒక దుస్సంఘటన అన్న భావనలోకి రావడం చూస్తూ ఉంటాం. ఈ రెండిటి మధ్య స్వల్ప వైరుధ్యాలు ఉన్నా ఆడపుట్టుక రోజు శోక ప్రకటనగా భావించే భావజాలం ఉండటం తెలుగు సమాజంలో కాస్త తక్కువే. అయినా పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సమాజంలో శోకప్రకటన చేయటం ఒక దౌర్భాగ్యం.
అడ్డూ అదుపు లేని పీడనను వర్గ దృక్పథంతో పాటు లింగ వివక్ష కథలను గాధలను దేవ్లి రూపంలో చూయించారు. రూబీన పర్వీన్‌ రచించిన 12 కథలలో పోగులు మెలి తిప్పి ఒక బలమైన బంధాలను కట్టిపడేసిన తాడుగా చేశారు. తెలంగాణ మట్టి పదాలతో రాసిన కథలన్నీ జెండర్‌ డిస్క్రిమినేషన్‌ పరిష్కారాల మార్గాలుగా చూయిస్తూ ఉన్నాయి.
One is not born but rather becomes a woman
….. Simone De Beauboir
స్త్రీ, పురుషుల పుట్టుకలు శాస్త్రీయ పరంగా సమానమైనా సమాజ పరంగా వేర్వేరు. దానిని ఛేదించాలన్న తలంపుతో చక్కటి పరిష్కారాలతో రాసిన ‘జమిలి పోగు’ విస్తృ‌తం అవ్వాలి. జెండర్‌ డిస్క్రిమినేషన్‌ సమస్యకు తగు పరిష్కారాలను వెతుకుతూ ముందుకు ప్రవహించాలి.
– వహీద్‌ ఖాన్‌, 9441946909