ప్రజాస్వామ్య పరిరక్షణలో జనసేవాదళ్‌

Janaseva Dal in defense of democracy–  సంఘపరివార్‌ శక్తులు రెచ్చిపోతున్నాయి
– జాతీయస్థాయి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజాస్వామ్య పరిరక్షణ, మతోన్మాద శక్తులను నిలువరించాలంటే జనసేవాదళ్‌ కార్యకర్తలు ముందు వరుసలో నిలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలో సీపీఐ జనసేవాదళ్‌ జాతీయ శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జన సేవాదళ్‌ కార్యకర్తలతో కలిసి పెరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యుల ఆస్తుల పరిరక్షణ, భూపోరాటాలు, మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు చండ్ర రాజేశ్వరరావు జన సేవాదళ్‌ను ఏర్పాటు చేశారని, నాలుగు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా జనసేవాదళ్‌ చారిత్రక కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. దేశంలో జన సేవాదళ్‌ కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలు ప్రజల మధ్య మత చిచ్చును రేపుతున్నాయని, దాన్ని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టు పార్టీ, జనసేవాదళ్‌ కార్యకర్తలకే ఉన్నదని తెలిపారు. కులం, మతం ప్రాతిపదికన బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని, మతశక్తులను నిలువరించాలంటే అంకింతభావంతో పాటు క్రమశిక్షణ అవసరమన్నారు. భూ పోరాటాల్లో ప్రజలకు అండగా నిలవాలని, ప్రజా ఆందోళనలో, ఉద్యమాలకు దండుగా నిలవాలని, ఆపదలో ఆదుకోవాలని, అదే జనసేవాదళ్‌ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏండ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా 2024లో ఢిల్లీలో లక్ష మంది కవాత్‌ చేసే లక్ష్యంగా ఖమ్మంలో శిక్షణ ప్రారంభమైందన్నారు. జాతీయ స్థాయి శిక్షణ ముగిసిన తరువాత, రాష్ట్ర, జిల్లా మండల స్థాయిల్లో శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమానికి ఆతిథ్యమించిన ఖమ్మం జిల్లా సమితిని అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, సహాయ కార్యదర్శి దండి సురేష్‌, కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ మహ్మద్‌ మౌలానా, రాష్ట్ర సమితిసభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్‌.కె. జానిమియా, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కరకుమార్‌, ఏఐఎస్‌ఎస్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, నానబాల రామకృష్ణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు తాటి నిర్మల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పగిడిపల్లి ఏసు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు లక్ష్మినారాయణ, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి బోడా వీరన్న, పాల్గొన్నారు.