నవతెలంగాణ- వనపర్తి
మహిళా హక్కుల పరిరక్షణ కోసం అక్టోబర్ ఐదు న ఢిల్లీలో నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా లక్ష్మీ నరసింహ కాలనీ లో జాత ఆదివారం చేత నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మీ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు మహిళా హక్కులకు రక్షణ భద్రత కల్పించాలన్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. కేరళ, తమిళనాడు తరహాలో రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పని దినాలు సంవత్సరానికి 200 చేయాలన్నారు. కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 600 కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికై పేదలకు కేంద్ర ప్రభుత్వం పది లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5,50,000 ఇవ్వాలని, అర్హులైన వారందరికీ 125 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం రద్దు చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి రేణుక, కవిత , రంజాబి, పార్వతి, సుశీల, చింతకుంట చంద్రమ్మ, నాగలక్ష్మి, లావణ్య, జ్యోతి, శేషమ్మ, తదితరులు పాల్గొన్నారు.