జూన్‌ 3 నుంచి జయశంకర్‌ బడిబాట

– 17 వరకు నిర్వహణ : పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చేనెల జూన్‌ మూడు నుంచి 17వ తేదీ వరకు జయశంకర్‌ బడిబాట కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సోమవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు వచ్చేనెల 12వ తేదీ నుంచి పున:ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అన్ని ఆవాస ప్రాంతాల్లో గల బడిఈడు పిల్లలందర్నీ గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడమే బడిబాట లక్ష్యమని పేర్కొన్నారు. సమాజ భాగస్వామ్యంతో సర్కారు బడులను బలోపేతం చేయాలని కోరారు. సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఐదేండ్ల వయస్సు పూర్తి చేసుకున్న పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఐదో తరగతి పూర్తి చేసుకున్న పిల్లల్ని ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్టర్‌ (వీఈఆర్‌)ను అప్‌డేట్‌ చేయాలని కోరారు. తక్కువ ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సుకు తగ్గ తరగతిలో చేర్పించాలని కోరారు. మండలం, జిల్లాల్లోని పాఠశాలల వారీగా వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ముందస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. వచ్చేనెల మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు విద్యార్థుల నమోదు ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకు ఇంటింటికీ తిరిగి క్యాంపెయిన్‌ చేపట్టాలని సూచించారు. వచ్చేనెల 12 నుంచి 17వ తేదీ వరకు రోజువారీ కార్యక్రమాలుంటాయని వివరించారు. ఈనెల 31న జిల్లాస్థాయి సమావేశాన్ని కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించాలని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ చైర్మెన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్లు, ఇతర ప్రజాప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని ఆదేశించారు. వచ్చేనెల ఒకటో తేదీన మండల, పాఠశాల స్థాయి సమావేశాలను నిర్వహించాలని కోరారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. కలెక్టర్ల నేతృత్వంలో డీఈవోలు కోఆర్డినేటర్లుగా వ్యవహరించాలని, ఉపాధ్యాయ సంఘాలను, సామాజిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.