వీఓఏలకు జాబ్‌చార్ట్‌ ఇవ్వాలి

– అన్ని పనులూ చేయంచడం సరిగాదు
– ఐబీ డైరెక్టర్‌కు తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం వినతి
వీఓఏలకు జాబ్‌చార్ట్‌ ఇవ్వాలి
వీఓఏలతో అన్ని పనులు చేయంచడం సరిగాదనీ, వారికంటూ ఒక జాబ్‌ చార్ట్‌ విడుదల చేయాలని తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. మంగళవారం ఈ మేరకు హైదరాబాద్‌లోని సెర్ప్‌ కార్యాలయంలో ఐబీ డైరెక్టర్‌ వైఎన్‌రెడ్డికి వినతిపత్రాన్ని ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ, రాష్ట్ర అధ్యక్షులు కె.రాజ్‌కుమార్‌ అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న విఓఏకు ఒక జాబ్‌ చార్టు లేకపోవడంతో అన్ని పనులు చేయాల్సి వస్తున్నదని చెప్పారు. గ్రామ సంఘం పుస్తక నిర్వహణతో పాటు చిన్న సంఘాలకు బ్యాంక్‌ లోన్స్‌, స్త్రీనిధి లోన్స్‌ ఇప్పించడం, తిరిగి కట్టించడం, బ్యాంక్‌ లోన్స్‌ ఎంసీపీలు చేయడం, చిన్న సంఘాల సభ్యులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం, ప్రభుత్వ కార్యక్రమాలలో ఎస్‌హెచ్‌జి సభ్యులు పాల్గొనడం, ఎస్‌హెచ్‌జి సమావేశాలు నిర్వహించడం, పుస్తకాలు రాయడం వంటి చేస్తున్నామని తెలిపారు. వాటితోపాటు ఆన్‌లైన్‌ పద్ధతిలో మీటింగ్‌ల్లో పాల్గొనటం, అకౌంటింగ్‌ చేయడం, యాప్‌లను నిర్వహించడం భారంగా మారిందని చెప్పారు. వీఓఏలతో ఇలా గొడ్డుచాకిరీ చేయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎస్‌హెచ్‌జి, వీఓ లైవ్‌ మీటింగ్స్‌, అకౌంటింగ్‌లను విఓఏలు చేయడానికి సెర్ప్‌ నుంచి ప్రతి విఓఏకు ఒక ట్యాబ్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎస్‌హెచ్‌జి అకౌంటింగ్‌ విఓఏలకు లాగిన్‌ ఇవ్వాలనీ, బకాయి వేతనాలు త్వరగా ఇప్పించాలని కోరారు.