మణిపూర్‌పై పార్లమెంట్‌లో కుదుపు

Jolt in Parliament over Manipur

– ఉభయ సభల్లో మూడేసి బిల్లులు ఆమోదం
న్యూఢిల్లీ: మణిపూర్‌ సమస్య పార్లమెంటును మంగళవారం కూడా కుదిపేసింది. పార్లమెంట్‌ ఉభయసభలు వాయిదాల పర్వం తొక్కాయి. హింసాత్మక మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసిన ప్రతిపక్షాల ఆందోళనతో ఉభయసభలు దద్దరిల్లాయి. ఈ గందరగోళం నడుమే, సమగ్ర చర్చ లేకుండా ఉభయ సభల్లో చెరో మూడు బిల్లులు ఆమోదించు కున్నారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు మణిపూర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు హోరెత్తించారు. దీంతో సభ కేవలం 16 నిమిషాల్లోనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన నడుమ కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో జనన మరణాల నమోదు బిల్లును ఆమోదానికి కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు ప్రతిపాదించారు. దీనిపై బీజేపీ ఎంపీ గుమన్‌ సింగ్‌ డమోర్‌, వైసీపీ ఎంపి ఎన్‌.రెడ్డప్ప, శివసేన (షిండే) ఎంపీ రాహుల్‌ రమేష్‌, బీఎస్‌పీ ఎంపీ సంగీతా ఆజాద్‌, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడిన తరువాత, హౌం సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు సమాధానమిచ్చారు. ఆ తరవాత బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మినరల్‌ డవలప్‌మెంట్‌ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. దీనిపై బీజేపీ ఎంపీ గోపాల్‌ చినయ్య శెట్టి, బీజేడీ ఎంపీ పినాకి మిశ్రా, శివసేన (షిండే) ఎంపీ కృపాల్‌ బాలాజీ, బీఎస్‌పీ ఎంపీ మలూక్‌ నగర్‌ మాట్లాడారు. అనంతరం మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమాధాన మిచ్చారు. తరువాత బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకు న్నారు. రాజ్యాంగ (ఎస్‌సీ) ఆర్డర్‌ సవరణ బిల్లును కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ ఆమోదం కోసం సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లుపై బీజేపీ ఎంపీ సంధ్యా రారు, వైసీపీ ఎంపీ జి.మాధవి, బీఎస్‌పీ ఎంపీ సంగీతా ఆజాద్‌ మాట్లాడిన తరువాత కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అనంతరం బిల్లును ముజువాణి ఓటుతో ఆమోదించారు. తరువాత సభను నేటీ (బుధవారం)కి వాయిదా వేశారు.
రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్‌
రాజ్యసభలోనూ అదే సీన్‌ కొనసాగింది. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. మణిపూర్‌పై చర్చ కోసం రూల్‌ 267 కింద ప్రతిపక్షాలు ఇచ్చిన 60 నోటీసులను రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తిస్కరించారు. అధికార పార్టీ సభ్యులు రూల్‌ 176 కింద ఇచ్చిన నోటీసులను ఆమోదించారు. ప్రతి పక్షాలు నినాదాలతో ఆందోళన చేపట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు చైర్మెన్‌ ధన్‌ఖర్‌ ప్రయత్నించారు. మణిపూర్‌ సంక్షోభంపై ప్రధాని మోడీ ప్రకటనకు పదే పదే డిమాండ్‌ చేసినా పట్టించుకోకపోవడంతో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ మణిపూర్‌ అంశంపై ప్రధాని మాట్లా డటం లేదనీ, తాము 11 రోజుల నుంచి ఎదురు చూస్తు న్నామని అన్నారు. సభలో ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం లేదని అన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అడ్వకేట్‌ సవరణ బిల్లును, కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ పిరియాడికల్స్‌ బిల్లును ప్రవేశపెట్టారు. తరువాత కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ జీవ వైవిధ్య సవరణ బిల్లును ఆమోదం కోసం ప్రతిపాదించారు. ఈ బిల్లుపై బీజేడీ ఎంపీ సులతా డియో, భూవనేశ్వర్‌ కలిట, బ్రిజ్‌లాల్‌, వైసిపి ఎంపిలు అయోద్య రామిరెడ్డి, వి.విజయసాయి రెడ్డి, టీఎంసీఎం ఎంపీ జికె వాసన్‌, బీఎస్‌పీ ఎంపీ రామ్‌జీ మాట్లాడిన అనంతరం కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. తరువాత బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించి, సభను నేటి (బుధవారం)కి వాయిదా వేశారు.