భారతీయ చిత్రకళా ప్రయాణం

కళాకారులకు, కళా ప్రేమికులకు ఒక అందమైన గుణం ఉంది. రణరంగాలు, రాజకీయాలు ఏ దిక్కునైనా పోనివ్వండి, కళలలో ఏ విధమైన కొత్తదనం, కొత్త శైలి కనిపించినా, ఆ కళను చూసి ఆనందిస్తారు. తుర్కులు భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చినప్పుడు వారితో పాటు వారి కళలూ, కళాకారులు భారతదేశం చేరారు.
భారతీయ చిత్రం, ప్రాచీన కాలంలో అరుదైన కళావస్తువు. క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 5 శతాబ్దం వరకు నిర్మించిన అజంతా గుహలలో గోడలపై చెప్పుకోదగ్గ అందమైన చిత్రాలు కనిపిస్తాయి. ఆపై క్రీ.శ. 5వ శతాబ్దపు బాగ్‌ గుహలలోనూ చూడవచ్చు. మళ్లీ క్రీ.శ. 8, 9వ శతాబ్దాల్లో ఎల్లోరా గుహల్లో కనిపిస్తాయి. శిల్పం కనిపించినంత ఆర్భాటంగా ప్రాచీన కాల భారత చరిత్రలో చిత్రం కనిపించదు. అందుకు కారణం లేకపోలేదు. రాతి కట్టడాలు, పెద్ద పెద్ద మందిరాల, శిల్పాల నిర్మాణాలు భారతీయ రాజుల రాచరికపు గుర్తు అయింది. అందువలన చిత్రకళకు నియమబద్ద ఆచారం లేక వెనుక బడింది. క్రీ.శ. 11వ శతాబ్దం తరువాతనే భారతీయ చిత్రకళ గమనం అందుకుంది. ముస్లింలు వారితో పాటు లఘు చిత్రకళని మన దేశం తీసుకువచ్చారు. ఈ లఘు చిత్రాలు ఎంతో వివరంగా దిద్ది అరచేతిలో వుంచుకుని ఆనందించవచ్చు. చిత్రాన్ని పరిశీలించవచ్చు. ఇవి తాళ పత్రాలపై చిత్రించేవారు. భారతీయ ఆచారం ప్రకారం తాళ పత్రాల మీద రాయబడిన లిపిని పత్రలేఖనం అనేవారు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల రాసిన పత్రలేఖనం ఇదే.
భారతదేశంలో చిత్రకళల అభివృద్ధికి బౌద్ధం కూడా ఒక కారణం. బౌద్ధంలో 3వ దశ అయిన వజ్రయానులు ‘అలౌకిక బుద్ధుడిపై ధ్యానం’ అనే విషయంగా దృష్టి వుంచి శిల్పాలతో పాటు, గోడలపై వేలాడదీయగలిగిన చిత్రపటాలు, చిత్రాలతో కూడిన తాళపత్ర గ్రంథాలు, అందులో బుద్ధుడి చరిత్ర, జాతక కథలు చిత్రించేవారు. ఇవి చదవడం కోసం కాదు. ఆ తాళపత్ర గ్రంథాలకు పలుచటి చెక్కతో పత్రాలను బంధించి దానిపై పాలతో కానీ, నూనెతో కానీ పసుపు కుంకుమ పెట్టి పూజించేవారు. ఆ గ్రంథాలు రాసిన వారికి, రాయించిన వారికి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఆ చెక్క మీద కూడా చిత్రాలు వేసేవారు.
ఈ పద్ధతి చిత్రాలు తూర్పు పాల రాజుల సమయం క్రీ.శ. 1100 నుండి 1200 మధ్య మొదలైందని చెప్పవచ్చు. వీటిని పాల గ్రంథాలు అని కూడా అంటారు. ఈ చిత్రాలకు ప్రకృతి సిద్ధంగా దొరికే ఖనిజపు రాళ్ల నుండి, వృక్ష సంపద నుండి సహజమైన రంగులని సిద్ధం చేసేవారు. తాళ పత్రాలను కావలసిన పరిమాణంలో కత్తిరించి, రాతితో రుద్ది నునుపు చేసేవారు. పలుచటి తెల్లరంగు మొదటి పూత పూసి, ఒక ఎరుపు రంగు గీతల్లో వారికి కావలసిన చిత్రం గీసి, ఆపై రంగులు నింపారు. పైన కట్టే చెక్కలకి ఒక రెసిన్‌ పూత పూసేవారు. ఇలా వారు ఎన్నో గ్రంథాలయాలు సిద్ధం చేసుకున్నారు. క్రీ.శ. 12వ శతాబ్దంలో చొచ్చుకుని వచ్చిన తుర్కుల వల్ల వారి గ్రంథాలు ఎన్నో నాశనం అయ్యాయి. నిరాశ చెందిన బౌద్ధులు హిమాలయాల్లో, హిమవత్‌ శాంతిని వెతుక్కుంటూ వెళ్లిపోయారు.
పశ్చిమ భారతం : పశ్చిమ భారతపు గుజరాత్‌, రాజస్థాన్‌ లోని జైనులు భారతీయ చిత్రకళ వృద్ధికి మరో గొప్ప కారణమయ్యారు. ముస్లింలు పెద్ద ఎత్తున దండెత్తి వచ్చినా, ఎంత మాత్రం చలించక క్రీ.శ. 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు నిరంతరంగా చిత్రకళని వృద్ధి చేశారు. వీరి వలన పశ్చిమ భారతంలో జైన గ్రంథాలుగా మొదలైన చిత్రకళ, రాజస్థానీ శైలి అనే ఒక ప్రత్యేక శైలిగా పెరిగి పెద్దదైంది.
జైనులలో జ్ఞానపూజ లేదా శాస్త్రపూజ అనే పేరు మీద గ్రంథాలను పూజించే పురాతన పరంపర వుంది. క్రీ.శ. 8వ శతాబ్దం నుండి భట్టారకులనే జైన మునులు గ్రంథాలను రాయించి సేకరించారు. ధనవంతులు, వ్యాపార వేత్తలు ధర్మకర్తలుగా రాయించే ఈ గ్రంథాలు, వ్యాకరణం, జ్యోతిష్యశాస్త్రం, భగవన్నామ కథలూ కావచ్చు. ఇవి చిత్ర పటాలు అవ్వొచ్చు. తాళపత్ర లేదా కాగితపు గ్రంథాలవ్వొచ్చు. కొన్ని బంగారు గీతలతోనూ రాయించారు. ఇవన్నీ మందిరాలలో జ్ఞాన భాండాగారాలు లేదా శాస్త్ర భాండాగారాలు అనే గ్రంథాలయాలలో భద్రపరిచారు. వాటికి భట్టారకులనే జైన మునులే జాగ్రత్తపరిచే అధిపతులు. కల్పసూత్రం అనే గ్రంథం శ్వేతాంబర జైనుల పవిత్రగ్రంథ్రం. అలాగే కలకాచార్య కథ, ఆదిపురాణం, మహా పురాణం, యశోధర చరిత్ర వంటి ముఖ్య గ్రంథాలను ఎన్నోసార్లు ప్రతిలిపిలు రాయడమే కాక, వాటికి తగ్గ చిత్రాలు కూడా వేయించి గ్రంథాలు రాయించబడ్డాయి. గుజరాత్‌లోని పాటన్‌, కాంబే, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, ఆబూ లోని భాండాగారాలు ముఖ్యమైనవి.
క్రీ.శ. 11, 12 వ శతాబ్దాలలో జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు ఒకే మాదిరిగా కనిపించేవి. గ్రంథాలకు పైన, కింద పలుచటి చెక్క అట్టలు, వాటిపై చిత్రాలు, లతలు ఒకే రకమైన శైలిలో చిత్రించారు. క్రీ.శ. 14వ శతాబ్దంలో తాళపత్రానికి బదులు కాగితం వాడకం మొదలయ్యాక చెక్క అట్టలు వదిలేశారు. క్రీ.శ. 13వ శతాబ్దం వరకూ జైనులు గ్రంథాలే కాదు, అతి చక్కటి శిల్ప నిర్మాణ మందిరాలనూ కట్టించారు. క్రీ.శ. 13వ శతాబ్దం నుండి ముస్లింల అధికారంలో వారి మత సంబంధ కార్యాలు, భవన నిర్మాణాలు కష్టమైనాయి. అప్పటి నుండి వారి ధర్మకార్యాలను వారు పవిత్ర గ్రంథాలు, సాహిత్యం వైపు మళ్లించి రహస్య స్థలాల్లో గ్రంథాలను భద్రపరిచారు. అలా వారు వారి మత సంస్కృతికి సంబంధ విషయాలను పరుల కంట పడి ధ్వంసం కాకుండా కాపాడారు.
కళాకారులకు, కళా ప్రేమికులకు ఒక అందమైన గుణం ఉంది. రణరంగాలు, రాజకీయాలు ఏ దిక్కునైనా పోనివ్వండి, కళలలో ఏ విధమైన కొత్తదనం, కొత్త శైలి కనిపిస్తే, ఆ కళను చూసి ఆనందిస్తారు. తుర్కులు భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చినప్పుడు వారితో పాటు వారి కళలూ, కళకారులు భారతదేశం చేరారు. కొంతమంది గ్రంథకర్తలు, చిత్రకారులకు ఇస్లాముల కళలు, గ్రంథాలు చూసే అవకాశం దొరికింది. వీరూ వారి కళాపద్ధతులను గమనించి తమ పద్ధతులలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకువచ్చారు. సుమారు క్రీ.శ. 1350 నుండి 1550 మధ్య భారతీయ చిత్ర కళా శైలి మారింది. అప్పుడే మన భారతీయ కళలలోకి పలుచటి బంగారు తగరం వాడడం, ఒక ప్రత్యేక నీలం రంగు వేయడం మొదలైంది. ఇవి ఇస్లాముల కళల శైలి. చిత్రం వేయవలసిన పత్రం మీద బంగారు తగరం అతికించి గీతల్లో బొమ్మ గీస్తారు. ఆపై మధ్యలో రంగులు నింపుతారు. ఎక్కడ రంగులు వేయరో అక్కడ బంగారు రంగు మెరుస్తుంది. అయితే ఈ పద్ధతిలో బంగారు రంగుపై ధ్యాస పెట్టినప్పుడు చిత్రాల నైపుణ్యమూ తగ్గేది.
కాగితం వాడడం మొదలు పెట్టాక చిత్రం గీసే వెడల్పు, పొడవుతో కాగితపు పరిమాణం పెరిగింది. ఎక్కువగా ఎరుపు, నీలం రంగుల మొదటి పూత పూసి, దానిపై ప్రకృతి దృశ్యాలు, వివరంగా నదులు, చెట్లు, కొండలు, ఆకాశం చిత్రించడం మొదలైంది. ప్రముఖ చిత్రకారుడు విషయాన్ని రేఖల్లో చిత్రం గీస్తే అనుచరులు రంగులు అద్దుతారు.
ఇలా సాగుతున్న చిత్రకళలో జైన చిత్రాలు, మటుకు వాటి శైలి, ఒక గుర్తింపుని వదలలేదు. చిత్రంలోని ముఖాలు 3 వంతులే కనిపిస్తాయి. పొడవాటి ముక్కు, ఉబ్బిన కళ్లు చెంపల కంటే ముందుకు పొడుచుకుని వచ్చి, ఇది జైన చిత్ర కళ అని గుర్తించవచ్చు. ఇలా రాజకీయ, సాంఘిక అవాంతరాలలో వారు వందల వేల జైన గ్రంథాలు రాయించి భద్రపరిచారు. వసంత విలాసం, బాలగోపాల స్తుతి వంటి కొన్ని హిందూ గ్రంథాలు కూడా ఆ సమాయనివే.
మిశ్రమ పద్ధతి : క్రీ.శ. 13 వ శతాబ్దం తరువాత, భారతీయ చిత్రకారులపై ఇస్లాముల కళా పద్ధతులు ప్రభావం పడి ఒక మిశ్రమ పద్ధతి మొదలైంది. భారతదేశంలో క్రీ.శ. 1192 – 1298 లో మామ్లక సుల్తానులు, క్రీ.శ. 1290 – 1320 లో ఖిల్జీలు, క్రీ.శ. 1320 – 1414లో తుగ్లకులు, క్రీ.శ. 1414 – 51 సయ్యద్‌ల ప్రభావంతో భారతీయ కళలు, నిర్మాణాలు సాహిత్యం, సంగీతం… ఇలా ఎన్నో విషయాలలో భారతీయ జీవన పద్ధతిలో మార్పులు వచ్చాయి. దావూద్‌ ముల్లా అనే కవి రాసిన లౌరచందా అనే కథని ఎన్నో సార్లు చిత్రాలుగా చిత్రించడం జరిగింది. ఆ కథ చిత్రాలు ఒక మైలురాయి అయ్యాయి. గుజరాత్‌, మాల్వా, జాన్‌పూర్‌ ముస్లిం రాజుల ఆస్థానాలలో పర్షియన్‌ కళాకారులు చేరడం వలన చిత్రకళ మరో అందం చేర్చుకుంది. క్రీ.శ. 1451 – 1526 వరకూ లోధీల ప్రభావమూ ఎక్కువగానే పడింది. కొన్ని చిత్రాల గ్రంథాలలో హిందూ ముస్లింల కలగలుపు చిత్రాలు, సాంఘిక కలగలుపు కథలూ, వాటికి చిత్రాలు మొదలయ్యాయి. క్రీ.శ. 15,16 శతాబ్దాల భక్తి సాహిత్యం, సంగీతం, హిందూ ముస్లిం మిశ్రమ శైలి ప్రభావాల ఫలితమే.
అవధి, బ్రిజ్‌ భాష నుండి మొదలైన వైష్ణవ సాహిత్యం భక్తి సాహిత్యమేను. తెలుగులోనూ అదే సమయంలో పోతన రాసిన భాగవతం వైష్ణవ భక్తి గ్రంథమేను. తాళపాక అన్నమాచార్య రాసిన భక్తి కీర్తనలు ఈ కాలానివే. తులసీదాస్‌ రాసిన రామచరిత మానస్‌, హనుమాన్‌ చాలీసా భక్తి కవిత ఈనాటివేను. ఈ భక్తి పాటలకు, కవితలకు తరువాత చిత్రాలతో కూర్చి గ్రంథాలు రాయబడ్డాయి.
ఇస్లాముల సూఫీ కవితలు పర్షియన్‌, అరబిక్‌ మిశ్రమాల భక్తి సాహిత్యం. ఇదీ ఈ సమయానిదేనూ. క్రీ.శ. 1490 – 1510 లో వెలువడిన చిత్రాల గ్రంథాలలో మధ్య భారతదేశంలోని మండూ నుంచి నీమత్‌ నామా, 50 చిత్రాలతో వున్న వంటకాల గురించిన గ్రంథం అది. అంటే ఆ సమయానికి చిత్రాలలో మానవ జీవిత సాంఘిక విషయాల చిత్రీకరణ కూడా జరిగింది. చెంఘీస్‌ఖాన్‌ ప్రయాణాలు, ఆక్రమణల వల్ల జరిగిన మరో మార్పు భారతదేశంలో జరుగుతున్న హిందూ ముస్లిం మిశ్రమ చిత్రకళలోకి చైనా వారి చిత్రకళా పద్ధతులూ చోటు చేసుకున్నాయి. భారత – చైనా మధ్య పురాతన యుగంలోనే సంబంధాలు వున్నా క్రీ.శ. 15,16 శతాబ్దలలో చిత్రకళలో ప్రభావం కన్పించింది. చైనా వారు చిత్రించే ఆకాశంలోని మబ్బులు, గుండ్రటి కొండలు, లతలు, పూలు, ప్రకృతి దృశ్యాలు ప్రత్యేకత సంతరించుకుని వుంటాయి.
లౌరచందా కథా చిత్రాలకు మల్లే, చౌరపంచాశిక అనే కవితల చిత్రాలూ ఒక ప్రత్యేకత సంతరించుకుని భారతీయ చిత్రకళలో ఒక మైలురాయి అయింది. బిలహణ అనే చోరుడు తన ప్రేయసి కోసం రాసిన అందమైన 50 కవితల సంపుటి ఇది. ఈ కవితల చిత్రాలు, లౌరచందా చిత్రాలు, జైన చిత్రాల శైలిలో ఉబ్బిన కళ్లు, పొడవు ముక్కు పద్ధతిలో క్రీ.శ. 15,16 శతాబ్దాలకు, ఆపై శతాబ్దాలకు మధ్య వంతెన శైలిలా నిలిచి వుంటాయి. ఇలాంటి వంతెన శైలి భాగవత చిత్రాలు, జయదేవుడి గీత గోవింద చిత్రాలలోనూ కనిపిస్తుంది. ఆపై శతాబ్దాలలో శైలి మారుతుంది.
– డా||యమ్‌.బాలామణి, 8106713356