– ఆర్టికల్ 370 రద్దును సమర్థించడంపై రివ్యూ పిటిషన్
– త్వరలో సుప్రీంకోర్టులో దాఖలు చేస్తాం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆర్టికల్ 370 రద్దును సమర్థించే నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్ యూసఫ్ తరిగామి వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజంలోని భాగస్వామ్యవాదులతో కలిసి సుప్రీంకోర్టులో త్వరలో రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు. డిసెంబర్ 11న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 1019 ఆగస్టు 5న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో తరిగామి జమ్మూ కాశ్మీర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తలుపులు తెరిచి ఉన్నాయి. మన కోసం తలుపులు తెరుచుకోవడం లేదని మనం ఎందుకు అనుకోవాలి. గతంలో, ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మేం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు, చాలా మంది నిరాశావాదులు, మమ్మల్ని నిరుత్సాహపరిచారు’ అన్నారు. ‘కానీ రాజకీయ నాయకుడిగా, ఈ దేశ పౌరుడిగా, రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశంముంది. కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో తీవ్ర అన్యాయం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కులపై దాడి అని తరిగామి అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలంటూ అప్పీలు చేస్తాం. మా చర్చలు కొనసాగుతున్నాయి. దరఖాస్తులు పరిశీలించబడుతున్నాయి’ అని ఆయన అన్నారు.
‘తప్పుదోవ పట్టించే కథనాలు’
జమ్మూ కాశ్మీర్‌ను పీడిస్తున్న ఉగ్రవాదం, ఇతర దుష్పరిణామాలకు ఆర్టికల్ 370 కారణమని తప్పుడు కథనంపై తరిగామి విచారం వ్యక్తం చేశారు. కేంద్రంలోని వరుస పాలనల వల్ల ఆర్టికల్ 370 క్రమంగా క్షీణించిందని, ప్రజాస్వామ్య ప్రక్రియను ఢిల్లీ ప్రభావితం చేసి, చివరికి ఆర్టికల్ 370 ‘బొమ్మ’గా మార్చిందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించేందుకు తప్పుదారి పట్టించే కథనాలు నిర్మించారని తరిగామి దుయ్యబట్టారు. ‘జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ 2017లో జీఎస్టీని ఆమోదించడం ఇటీవలి కాలంలో అలాంటి ఉదాహర ణలలో ఒకటి. ఆర్టికల్ 370ని ఆమోదించే సమయ ంలో ఊహించని విధంగా 42 రాజ్యాంగ ఉత్తర్వులు కేంద్ర జోక్యం పరిధిని పొడిగించాయి’ అని తెలిపారు.