అమీన్‌పూర్‌ బాధితులకు న్యాయం చేయాలి

– సాహితీ శర్వాణి ఎలైట్‌ ప్రాజెక్ట్‌ బాధితుల సంఘం
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
ఏపీలో సత్యం స్కాం, అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసినట్టుగానే హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని అమీన్‌పూర్‌ సాహితీ శర్వాణీ ఎలైట్‌ ప్రాజెక్టు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని సాహితీ శర్వాణి ఎలైట్‌ అమీన్‌పూర్‌ ప్రాజెక్టు బాధితుల సంఘం నాయకులు కోరారు. అమీన్‌పూర్‌ సాహితీ శర్వాణీ ఎలైట్‌ ప్రాజెక్టులో డబ్బు చెల్లించి మోసపోయిన బాదితులు ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కిషన్‌ రెడ్డి, మధుకర్‌ మాట్లాడుతూ.. సాహితీ శర్వాణీ ఎలైట్‌ ప్రాజెక్టు వెంచర్‌లో ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు డబ్బు చెల్లించిన వారికి డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపించారు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌తో అమాయకులను మోసగించిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, వెంచర్‌ నిర్వాకులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ వెంచర్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై, అమాయకులను మోసగించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి ప్లాట్‌ కోసం డబ్బులు చెల్లించిన వారి వివరాలను సేకరించి, చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియనూ చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితుల సంఘం నాయకులు హనుమంతరావు, వంశీ, ఫణీంద్ర, రమణ, నరేంద్రబాబు, భీమేష్‌ తదితరులు పాల్గొన్నారు.