బీఆర్‌ఎస్‌కు సినిమా చూపిస్తాం : కె.లక్ష్మణ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాలమూరు ప్రజా గర్జన ట్రైలర్‌ మాత్రమేననీ, మున్ముందు బీఆర్‌ఎస్‌ పార్టీకి అసలు సినిమా చూపిస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రజాగర్జన విజయవంతమైందన్నారు. దీంతో తమ కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు కేసీఆర్‌ ఫ్యామిలీ వణికిపోతున్నదని విమర్శించారు. ప్రధానిపై గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్టు కేటీఆర్‌ మాట్లా డితే బాగుండదన్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయింద న్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌గా కేటీఆర్‌నే ఎందుకుండాలి? బీసీ, ఎస్సీ నాయకులు ఎందుకు ఉండొద్దు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫ్యామిటీలో ఐదుగురు క్యాబినెట్‌ మంత్రులు కొనసాగుతున్నారని విమర్శించారు.
కొలువుల కోసం కొట్లాడిన యువత జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఏమైందని నిలదీశారు. పోడుభూములకు పట్టాలేమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నదనీ, దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు ఆదాయాన్ని పెంచుకున్నరన్నారు. ఒక చేత్తో పింఛన్‌ ఇస్తూ..మరో చేత్తో పేదల నుంచి రూ.10 వేలు లాక్కుంటున్నారని ఆరోపించారు.
అన్ని పథకాలను విస్మరించి కమీషన్లకు అలవాటు పడ్డారని విమర్శించారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని వస్తుంటే సీఎం కేసీఆర్‌ ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్రం తొమ్మిదేండ్లలో రూ. 9 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. పసుపు బోర్డును, ట్రైబల్‌ యూనివర్సిటీని ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.