– మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా ఉపయోగపడుతున్నదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ ఆరోపించారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచారని విమర్శించారు. కాంగ్రెస్ మొదలుపెట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును బీఆర్‌ఎస్ కాళేశ్వరంగా మార్చిందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరం పేరు చెప్పుకుని బీఆర్‌ఎస్ ఓట్లు దండుకుందని చెప్పారు.
కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న బీజేపీ ఎలాంటి విచారణ చేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వృధా చేసిన సొమ్ము తెలంగాణ ప్రజలపై అప్పుగా మారిందన్నారు. రైతుల కోసం నీళ్లు ఇచ్చేందుకు అని చెబుతూనే అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ట్రాక్ రికార్డు కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయని చెప్పారు.
అధికార మదంతో కేసీఆర్ విర్రవీగుతున్నారు : రేణుక చౌదరి
రాహుల్‌గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధికార మదంతో విర్రవీగుతున్నారని విమర్శించారు. ప్రతి మనిషిపై లక్షకుపైగా అప్పు భారం మోపిందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ విత్తనాలతో 8వేల మంది రైతు కుటుంబాలు నాశమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సీఎం కేసీఆర్ నోరుమెదపడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కౌలు రైతులను గుర్తించడం లేదన్నారు. ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విఫలమైనట్టు ఒప్పుకుని చెంపలేసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.