కల్లాల్లో కల్లోలొం

– అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం
– మిల్లర్ల తరుగు దోపిడీ
– కాంటా వేసినా దించుకోని మిల్లర్లు
– సివిల్‌ సప్లరు అధికారుల ఆదేశాలు బేఖాతర్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దీనంగా మారింది. యాసంగి సీజన్‌ పంటల సాగు ఆశాజనకంగా సాగినా అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఉన్న ధాన్యాన్ని అమ్ముకుందామంటే తేమ, తాలు పేర కొనుగోళ్ల ప్రక్రియ సవ్వంగా సాగట్లేదు. తరుగు పేర మిల్లర్లు దోపిడీకి పాల్పడుతుండటంతో అన్నదాత అరిగోశ పడుతున్నాడు. తరుగు తీస్తే తప్ప కాంటా వేసిన ధాన్యం బస్తాలను దించుకోబోమని మిల్లర్లు బెదిరిస్తున్నారు. దీంతో కల్లాల్లో ధాన్యం రాసులు కదలట్లేదు. దిక్కులేని పరిస్థితుల్లో రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యతో రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఆందోళనలు జరగని రోజంటూ లేదు. సివిల్‌ సప్లరు అధికారుల ఆదేశాలను మిల్లర్లు బేఖాతర్‌ చేస్తుండటం గమనార్హం.
ధాన్యం పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా మారింది. వర్షాలకు తోడు మిల్లర్ల ఇష్టారాజ్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలకు ధాన్యం తడిసి రంగు మారడం, మొలకెత్తడాన్ని ఆసరా చేసుకుంటున్న మిల్లర్లు బహిరంగంగానే దోపిడీకి పాల్పడుతున్న ఉదంతాలున్నాయి. వారు చెప్పిందే వేదం అన్నట్టుగా సాగుతోంది. అధికారుల మొక్కుబడి పర్యటనలు తప్ప నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెదక్‌ జిల్లాలో 2.24 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. జిల్లా వ్యాప్తంగా 411 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 407 కేంద్రాల ద్వారా 25880 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. లక్షా 7300 మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని మిల్లర్లకు అప్పజెప్పారు. ఇంకా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు రావాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలో 1.01 లక్ష ఎకరాల్లో వరి సాగైంది. 200 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు లక్ష మెట్రిక్‌ టన్నుల వరకే కాంటా వేశారు.
సవ్యంగా సాగని కొనుగోళ్లు
ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణ ముందుకు సాగట్లేదు. ఏప్రిల్‌ నుంచే ధాన్యం మార్కెట్‌కు వచ్చినా కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అకాల వర్షాలు పడటంతో తడిసిన ధాన్యం కాంటా వేయకూడదని కొనుగోళ్లల్లో జాప్యం జరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టాక మే మొదటి నుంచి వేగం పెంచారు. అప్పటికే ధాన్యం తడిసి పోయింది. రంగు మారడం, మొలకెత్తడం వల్ల కాంటా వేయలేదు. వాతావరణం అనుకూలించాక కాంటా వేయడంలో వేగం పెంచినా ఆ మేరకు ధాన్యం బస్తాలను వెనువెంటనే మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. దాంతో మళ్లీ కాంటాలు నెమ్మదించాయి. కల్లాల్లో ధాన్యం రాసులు కదలని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ వర్షాలు పడుతుండటంతో కాంటా వేసిన బస్తాలు, రాసులు తడిసిపోతున్నాయి. తూప్రాన్‌, నర్సాపూర్‌, నంగునూరు, హత్నూర్‌, చిలిపిచేడు, మెదక్‌, సదాశివపేట, సంగారెడ్డి, హుస్నాబాద్‌ వంటి ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేయాల్సి వచ్చింది.
మిల్లర్ల తూకం దోపిడీ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేటప్పుడే బస్తాకు కొంత తరుగు తీస్తున్నారు. 40 కిలోల తూకం వేస్తున్నారు. ఖాళీ బస్తా 650 గ్రాముల బరువుతోపాటు 5 నుంచి 8 కిలోల వరకు ధాన్యం అదనంగా జోకుతున్నారు. రైతుల ఆందోళనతో మిల్లర్లు కొంత పంథా ఎంచుకున్నారు. కాంటా వేసే సమయంలో కాకుండా లారీ లోడును మిల్లులో అన్‌లోడ్‌ చేసే సమయంలో లారీకి టోక్‌గా 18 క్వింటాళ్ల వరకు తరుగు తీసేందుకు అంగీకరిస్తేనే ధాన్యం దించుకుంటున్నారు. రైతులు అంగీకరించకపోతే లారీలను మిల్లు బయటే ఉంచుతున్నారు. దీంతో నర్సాపూర్‌, మెదక్‌, కౌడిపల్లి, తూప్రాన్‌, రామాయంపేట ఇతర మిల్లుల వద్ద 20 నుంచి 30 లారీల వరకు ధాన్యం లోడుతో ఉండిపోతున్నాయి. ఐదారు రోజుల వరకు దించుకోని పరిస్థితి ఉండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేసే పని ఆపేస్తున్నారు. దీంతో ఎక్కడి ధాన్యం రాసులు అక్కడే ఉంటున్నాయి.
ధాన్యం కొనుగోళ్లలో వేగం: వనజాత, డీఎస్‌ఓ సంగారెడ్డి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధాన్యాన్ని కాంటా వేసిన వెంటనే ఎగుమతి చేసేందుకు అసరమైన లారీలను ఏర్పాటు చేస్తున్నాం. మిల్లర్లు ఎప్పటికప్పుడూ ధాన్యాన్ని దించుకునేలా చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. తూకం పేర అదనంగా కాంటా వేయడం, మిల్లు పాయింట్‌ వద్ద తరుగు తీయడం జరగకుండా చూస్తున్నాం.
ధాన్యం కొనుగోళ్లల్లో సమస్యలు:జయరాజు, సీపీఐఎం జిల్లా కార్యదర్శి
తేమ పేరిట కాంటా వేయకపోవడంతో రైతులు వారాల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఆరబెట్టుకోవడానికి స్థలం లేదు. కొద్దిపాటి తేమ ఉన్నా కాంటా వేసేందుకు నిరాకరిస్తున్నారు. యుద్ధప్రాతిపాదికన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం కోనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలి. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు రోజువారీగా పర్యవేక్షించి రైతులు నష్టపోకుండా చూడాలి.