వ్యాధిని స్ఫూర్తిగా మార్చుకున్న కమల్‌ షా

– ”సిల్వర్‌ లైనింగ్‌” పుస్తకాన్ని ఆవిష్కరణలో ఎంపీ శశి థరూర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వ్యాధితో ఓడిపోకుండా ఆ వ్యాధినే స్ఫూర్తికి మూలంగా మార్చుకున్న నెఫ్రో ప్లస్‌ సహ వ్యవస్థాపకులు కమల్‌ షా జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్‌ ఎంపీ డాక్టర్‌ శశిథరూర్‌ కొనియాడారు. శనివారం హైదరాబాద్‌ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన కమల్‌ షా రాసిన ”సిల్వర్‌ లైనింగ్‌ – ఓవర్‌కమింగ్‌ అడ్వర్సిటీ టు బిల్డ్‌ నెఫ్రోప్లస్‌, ఇండియాస్‌ లార్జెస్ట్‌ డయాలసిస్‌ ప్రొవైడర్‌” పుస్తకాన్ని ఆవిష్కరించారు. డయాలసిస్‌ రోగి అయిన కమల్‌ షా తాను బాధపడినట్టుగా ఎవరూ బాధపడకూడదని నెఫ్రో ప్లస్‌ ను స్థాపించారని తెలిపారు. ఇంకా పుట్టని తరాల వారి కోసం సైతం దాన్ని ఎప్పటికీ నిర్వహణలో ఉంచాలని కమల్‌ షా నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌, రచయిత, బిజినెస్‌ కామెంటేటర్‌, టాటా సన్స్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ గోపాలకృష్ణన్‌, చలనచిత్ర నిర్మాత మధు మంతెన పాల్గొన్నారు.