యుద్ధం చేసిన రాజు యుద్ధంలో చస్తాడు, యుద్ధాలు చేయని రాజు చేసిన పాపాలకు శిక్ష అనుభవించేందుకు మంచంలోపడి తీసుకు తీసుకు పోతాడన్నమాట నిజమైంది. పేదోళ్ల పొట్ట కొట్టడం బాగా తెల్సిన పెద్దరాజు మంచాన పడ్నే పడ్డాడు. పడ్డవాడు చెడ్డవాడు కదా వెంటనే పైకి పోలేక, మంచం మీది నుంచి లేవలేక, అలా వుండిపోయేడు.
పెద్దరాజావార్ని ఒంట్లో జబ్బులు చాచిపెట్టి కొడుతుంటే మంచం పట్టాడని, ఒక పరిపాలించే ఛాన్సులేదని సంతోషపడ్డారు ప్రజానీకం. పులి కడుపున పులి, రాజు కడుపున రాజు పుట్టడం అసహజమేం కాదు గదా. వచ్చినవాడు గుడినీ గుళ్ళో లింగాన్నీ మింగడమే కాదు, అభిషేకం చేసిన పాలనీ వదిలేరకం కాదు. పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాంరో అని ప్రజలు అనుకోడానికి ఏమంత సమయం పట్టలేదు.
చిన్నరాజావారిని భూమాత అంటే అంత భక్తి ఉందని పాపం ఆ నేలతల్లికి తెలీనే లేదు. రాజావారి కల్లోకి హిరణ్యాక్షుడనేవాడు కనిపించి ఏం బోధపోశాడో ఏమోకాని కనపడ్డదాన్నల్లా కాజేయడం మొదలుపెట్టాడు. కాజేసిందాన్ని అమ్మేసి సొమ్ము పోగేయడం మొదలు పెట్టాడు.
ఖజానా నింపుకోడం, గానాబజానాలో కాలం గడపడమే పరిపాలన అని భావించిన చిన్నరాజావారికి అనుగ్రహించడం తెలీదు కాని, ఆగ్రహించడం మాత్రం బాగా అబ్బింది. జనాన్ని హింసించడం వారికొక ఎంటర్‌టైన్ మెంట్’ అయిపోయింది. మంత్రులూ, ఉన్నత ఉద్యోగులూ ఆయన ముందు గంగిరెద్దుల్లాగు నిలబడేవారు. చాటున ఈ దుర్మార్గుడు మనిషి కాదు కుక్క. కుక్కలా అరుస్తాడు, కరుస్తాడు అనుకునేవారు.
రాజావారికి ఉన్నట్టుండి ఓ ఆలోచన వచ్చింది. కోటలో ఉన్న పాత సామాను అమ్మేసి ఇటలీ నుండి ఫర్నిచర్, ఇరాన్ నుంచి టీ కప్పులు, చొప్పన్న దేశాల నుండి వెరైటీ వస్తువులు తెప్పిద్దాం అనుకున్నాడు. రాజు తల్చుకుంటే జీవోలకు కరువు వుండదు కదా. కోటలో అనేక గదుల్లోంచి పాత సామాను బయటకు రాసాగింది. వచ్చిన సామాన్ను ఊళ్లో వున్న సంపన్నులకు బలవంతంగా అంటగట్టి డబ్బు తెచ్చి ఖజానాలో నింపసాగారు ఉద్యోగులు.
ఇలాగ కొత్తసామాగ్రి కోసం తవ్విపోస్తున్న సమయంలో కోటలోని ఒకానొక చీకటి గదిలో ఓ పెద్ద సింహాసనం కనపడింది. దానిమీద చిన్నరాజా వారి కన్ను పడింది. దాన్ని తుడిపించి, కడిగించి చూస్తే అది ఒక కనకపు సింహాసనం అని తేలింది. ఇంత ప్యూర్ గోల్డ్, లలితా జ్యువెల్రీ వారి వజ్రాలు తాపడం చేసి ఉన్నది, ఇలా చీకటి గదిలో పారేసి పనికిమాలిన, బంగారు పూత పూసిన సింహాసనంలో ఎందుకు కూచోవాల్సి వచ్చింది అని అనుమానం రావడంలో మంచం మీద ఆరున్నొక్కరాగంతో మూలుగుతున్న పెద్దరాజా వారి దగ్గరికెళ్లి అడిగాడు.
ఎవర్రా నిన్ను ఆ సింహాసనం జోలికి వెళ్లామన్నది? అవసరమా? అన్నాడు రాజు. అవసరమే అన్నాడు చిన్నరాజు. గది తలుపులు మూయించి చెప్పాడు పెద్దరాజు. ఆ బంగారు సింహాసనం మన తాత ముత్తాతల కాలం నాటిది. అది మామూలు కనకపు సింహాసనం కాదు. దానిమీద కూచుంటే రాజు లోపలి మృగం కనిపిస్తాడు జనానికి. చినరాజావారికి అర్ధం కాలేదు. మరికాస్త వివరంగా చెప్పరాదూ అని విసుక్కున్నాడు.
మీ ముత్తాత తండ్రి దాన్ని చేయించాట్ట. అదేం మాయో గాని ఆయన దాని మీద కూచోగానే జనానికి ‘పెద్దపులి’లా కనిపిచాట్ట. వెంటనే దాన్ని తీసేసి ఇప్పుడు మనం వాడే దానిమీద కూచుని, మనిషిలా కనిపించాట్ట. తర్వాత మా ముత్తాత దాన్ని బయటకు తీయించి కూచుంటే జనానికి ‘తోడేలు’లా కనిపించాడంట. ఆ తర్వాత ఎవరు రాజ్యానికి వచ్చి, దాన్ని బయటకు తీయించి కూచున్నా వారి మనస్తత్వానికి తగ్గరూపంలో అంటే, ఎలుగుబంటి, పాము, ఊసరవెల్లి ఇలాగ రకరకాలుగా కనిపించారని చెప్తారు. నేను మాత్రం సాహసించి దానిమీద కూచోలేదు. చీకటి గదిలో పడేశాను. నువ్వు దాన్ని తక్షణం చీకటి కొట్లో పెట్టి తాళం వెయ్యి అన్నాడు రాజు.
తీసుకు తీసుకు పోయేవాడు పోక ఇంకా ఎంతకాలం మూల్గుతాడో అనుకుంటూ వెళ్ళిపోయాడు చిన్నరాజు.
వెళ్ళినవాడు తండ్రిమాట జవదాటని వాడు కానేకాడు కదా! ఆ సింహాసనం తెప్పించి దర్బారు హాల్లో పెట్టించాడు. దానిమీద తను కూచుంటే ఏ జంతువు లాగానో కనిపిస్తే అన్న అనుమానం వచ్చి, ఓ మంత్రిని కూచోమన్నాడు. ఆయన తర్వాత మరొకర్ని, ఆ తర్వాత ఇంకొకర్ని దానిమీద కూచోపెట్టి చూశాడు. అందరూ మామూలుగానే కనిపించారు. ఈ ముసలోడికి మైండు దొబ్బింది. సొల్లు కబుర్లు చెప్పి భయపెట్టేడు. వీడి మాటలు విని బంగారం లాంటి బంగారు సింహాసనం మీద కూచోవడం కాస్తలో ‘మిస్సయి’ ఉండేవాడిని అనుకున్నాడు. పురోహితుడ్ని మంచి ముహూర్తం రడీ చెయ్యమన్నాడు.
చిన్నరాజావారు పాత సింహాసనం మార్చి సరికొత్త కనకపు సింహాసనం ఎక్కబోతున్నారు కనుక పుర ప్రముఖులంతా కానుకలు తీసుకురావాలని ఆర్డర్లు జారీ అయ్యేయి. సుముహుర్తం రానే వచ్చింది. గ్యాలరీలో టిక్కెట్లు కొని వచ్చిన జనం నిండారు. పురప్రముఖులు చేతుల్లో ఏదో ఓటి పట్టుకువచ్చారు. సన్నాయి వాయిద్యాలు మోత మోగించాయి. షహనాయీలు బజాయించబడ్డాయి. రాజావారు, అయ్యవార్లూ మంత్రాలు చదువుతుంటే ఉత్సాహంగా కనకపు సింహాసనం మీద కూచున్నారు.
ఆయన అలా సింహాసనం ఎక్కగానే జనం నిర్ఘాంతపోయారు. కిక్కురుమనకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్లల్లో చాలామంది వీధికుక్కల్ని చూసి వున్నారు కానీ అంతపెద్దదైన జాతికుక్కను చూసి వుండలేదుమరి. ఎలా వున్నాను మంత్రీ అన్నాడు రాజు ఠీవీగా. మహారాజులా దర్జాగా వున్నారు అన్నాడు మంత్రి అదేపనిగా ఊగుతున్న కుక్కతోక వైపు జంకుతూ చూస్తూ. పుర ప్రముఖులంతా ఇంద్రుడిలా వున్నారని, చంద్రుడి బాబులా వున్నారని, జహాపనా అని, పనాజహా అని రకరకాలుగా నోర్లు నొప్పి పుట్టేట్టు మెచ్చుకున్నారు. మాట్లాడకుండా వున్న జనం మాత్రం మాట్లాడకుండా, పైకి కనిపించని వీడిలోపలి ‘జంతువు’ ఇదే అని అనుకున్నాంలే అనుకున్నారు.
మర్నాడు బంగారు సింహాసనం మళ్లీ చీకటి గదిలోకి మార్పించి తాళం వేయించాడు రాజు.
ఆ రోజు అంతా వెళ్ళిపోయాక తాను ఎలాగున్నానో అని అద్దం ముందు పెట్టుకుని చూశాడు కదా మరి!
– చింతపట్ల సుదర్శన్
9299809212