కర్నాటక బంద్‌ ప్రశాంతం

బెంగళూరు: కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటకలో శువ్రారం జరిగిన బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. కన్నడ, రైతు, సినిమాలకు చెందిన సుమారు 100 సంఘాలు పిలుపు మేరకు ఈ రాష్ట్ర బంద్‌ జరిగింది. ఈ బంద్‌కు మద్దతుగా హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలు కూడా పనిచేయట్లేదు. దీంతో కర్ణాటక ప్రజల సాధారణ జీవనం స్థంభించింది. ఈ బంద్‌ సందర్భంగా బెంగళూరులోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనం ముందు జరిగిన కార్యక్రమంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ సినీ నటులు పాల్గొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించారు. కర్ణాటక రక్షణ వేదికె, జయ కర్ణాటక సంఘం, హసిరుసేన, చెరకు సాగుదారుల సంఘం, ట్యాక్సీ- ఆటోరిక్షా సంఘాలు, కర్నాటక చలనచిత్ర వాణిజ్య మండలి, సినిమా కళాకారుల సంఘం తదితర వందకు పైగా సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉదయం ఆరు గంటల నుంచే బంద్‌ మొదలైంది. బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంద్‌ దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పలు చోట్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేఆర్‌ఎస్‌ ఆనకట్ట, పర్యాటక, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది. అటు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్‌ ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బెంగళూరు విమానాశ్రయంలో శుక్రవారం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్‌ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్‌ చేసుకోవడంతో ఈ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు తెలుస్తోంది.