‘కారుణ్య’ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

– టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీకి జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల స్థానంలో విధుల్లో చేరిన కుటుంబసభ్యులను రెగ్యులరైజ్‌ చేయాలని టీఎస్‌ఆర్టీసీ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ కే రాజిరెడ్డి అధ్యక్షతన సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు విన్నవిస్తూ, ఎగ్జిక్యూటివ్‌డైరెక్టర్‌ అడ్మినిస్ట్రేషన్‌కు విజ్ఞాపనపత్రం అందచేశారు. దీనిపై జేఏసీ కన్వీనర్‌ వీఎస్‌ రావు, కో కన్వీనర్‌ కే యాదయ్య సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులు ఉండి మరణిస్తే, వారి వారసులకు ఉద్యోగం కల్పించడం కోసం అవసరమైతే కొత్త ఉద్యోగం సృష్టించి నెలరోజుల్లో పోస్టులో నియామకం చేస్తారని తెలిపారు. కానీ ఆర్టీసీలో ఖాళీలను బట్టి నియమించాలనే నిబంధన అటంకంగా ఉందన్నారు. సంవత్సరాత తరబడి ఆ కుటుంబాల్లో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావట్లేదనీ, దాదాపు 1,100 మంది కుంటుంబాలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాయని వివరించారు. ఇటీవల కొందర్ని విధుల్లోకి తీసుకున్నా, వారిని రెగ్యులర్‌ ప్రాతిపదికన కాకుండా, కాంట్రాక్ట్‌ పద్ధతిలో కన్సాలిడేటెడ్‌ వేతనంతో పనిచేయించుకుంటున్నారని తెలిపారు. వారందరినీ తక్షణం రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. 160 మంది సెక్యూరిటీ గార్డులుగా నియమితులైన వారికి తార్నక ఆస్పత్రిలో వైద్యం, బస్‌పాస్‌ సౌకర్యం కూడా కల్పించలేదన్నారు. బ్రెడ్‌విన్నర్‌ స్కీంలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో రిక్రూట్‌ అయిన వారికి రెగ్యులర్‌ ఉద్యోగులతో వర్తించే అన్ని ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.