ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి సీఎంకు కాసాని డిమాండ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేయాలని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, చేసేది అర్థం కావట్లేదు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ తట్రస్ట్‌భవన్‌లో మెదక్‌ పార్లమెంటు పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు మెదక్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఇల్లందుల రమేష్‌, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి పుట్టి రాజు నాయకత్వంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పింది చేయడు..చేసింది చెప్పడని గుర్తు చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతుంటే నేటికీ వారికి సరైన ఉద్యోగాల కల్పన జరగలేదని విమర్శించారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3016 రూపాయలు నిరుద్యోగ భతి ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి పదేండ్లు సమీపిస్తున్నా దాని గురించి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఏ.కే గంగాధర్‌ రావు, జక్కిలి ఐలయ్య యాదవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి బిక్షపతి ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.