కాశీం, విమలక్క, సంధ్య, సుధా భరద్వాజ్‌పై ఉపా కేసును ఎత్తేయండి

సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ కాశీం, విమలక్క, సంధ్య, సుధా భరద్వాజ్‌లపై నమోదు చేసిన ఉపా, దేశ ద్రోహం కేసులను ఎత్తేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. నిరంకుశమైన, కాలం చెల్లిన ఉపా చట్టం ఎత్తేసేందు కు జాతీయ స్థాయిలో కేసీఆర్‌ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
తాడ్వాయి లో 152 మందిపై ఉపా, దేశద్రోహ కేసులు పెట్టినప్పటికీ ప్రొఫెసర్‌ హర గోపాల్‌ సహా ఆరుగురిపైనే కేసును ఉపసంహరించినట్టుగా పోలీసులు ప్రకటించారని తెలిపారు. మిగతా వారిలో ప్రొఫెసర్‌ కాశీం పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, విమలక్క వంటి వారి కూడా ఉన్నారని పేర్కొన్నారు. వారంతా ప్రజాజీవితంలో ఉంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరా డారని గుర్తు చేశారు. హర గోపాల్‌ తదితరులపైఉపసంహరించిన తరహా లోనే కాశీం, సంధ్య, విమలక్క తదితరులపై తాడ్వాయిలో నమోదైన ఉపా, దేశద్రోహ కేసులను ఎత్తేసేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా దేశానికి మంచి సంకేతాలు పంపాలని విజ్ఞప్తి చేశారు. నిరంకుశ ఉపా, కాలం చెల్లిన దేశద్రోహ చట్టాల రద్దును జాతీయ ఎజెండాలోకి తీసుకురావాలని కోరారు.