– ఫడ్నవీస్, శిండే, అజిత్ పవార్‌ల మధ్య కుర్చీలాట
మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అటు బీజేపీ దేవేంద్రఫడ్నవీస్ కాబోయే సీఎం అంటూ లీకులిస్తోంది. మరోవైపు ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే పోటీపడుతున్నారు. ఎన్సీపీ చీలికవర్గం నేత అజిత్ పవార్ కూడా తగ్గేదేలేదంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చైర్ రేసులో.. ఈ ముగ్గురి మధ్య ముక్కోణపు పోటీ కనిపిస్తోంది.
ముంబయి : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ నేతత్వంలోని మహాయుతి కూటమిని విజయం వరించింది. మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాగా ఇప్పుడు మహాయుతిలో ప్రభుత్వ ఏర్పాటు కత్తిమీద సాములా మారింది. మహాయుతిలో ఆ మూడు పార్టీల మధ్య లాబీయింగ్ పర్వం కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్…ఈ ముగ్గురిలో మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు. దీంతో మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను 234 స్థానాలను అధికార మహాయుతి కైవసం చేసుకుంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ ఒంటరిగా 132 సీట్లు గెలుచుకుంది. ఈ విజయం ఊహించనిది..ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలలో ఇంతకు ముందు ఏ కూటమి 200 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. మహాయుతి విజయంతో బీజేపీ, శివసేన (శిండే), అజిత్ పవార్ నేత ృత్వంలోని ఎన్సీపీ శిబిరంలో సంబరాల వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే దానిపై ఇప్పుడు అందరి దష్టి ఉంది.
ముఖ్యమంత్రి ఎప్పుడు, ఎవరు?
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. స్వల్పవ్యవధిలోనే మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం జరగవచ్చని, తొలుత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి మహాయుతిలో ఆ ముగ్గురు నేతలు, ఆయా పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో ఉన్నారని కమలం పార్టీ లీకులు వదులుతోంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రెండో బ్రాహ్మణుడు ఫడ్నవీస్. కాగా మూడోసారి ఈ పదవిని ఆయనే చేపడతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫడ్నవీస్ సీఎం కావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఏక్‌నాథ్ శిండే స్టాండ్ ఏమిటన్న దానిపై ఉత్కంఠ నెలకోంది. ప్రస్తు సీఎం, శివసేన చీలిక నేత కూడా అయిన శిండే తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ వర్గానికి గట్టి పోటీనిచ్చి 57 సీట్లు గెలుచుకున్నాయి. శివసేన (యూబీటీ) కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. మరోవైపు, అజిత్ పవార్ నేతత్వంలోని ఎన్సీపీ కూడా సమావేశం అయింది. ఈ సమావేశంలో పార్టీ నాయకుడిగా అజిత్ పవార్‌ను ఎన్నుకున్నారు. శరద్ పవార్ తన కెరీర్‌లోనే అతిపెద్ద ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆయన పార్టీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. పవార్ పార్టీ కూడా అబ్బాయి అజిత్ పవార్ నేతత్వంలోని శిబిరం కంటే వెనుకబడి ఉంది. అజిత్ వర్గం 41 సీట్లు గెలుచుకుంది.
సీఎం పదవిపై ఎన్సీపీ కూడా రేసులో ఉన్నట్టు ఛగన్ భుజ్‌బల్ చెప్పారు. అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు అని మీడియాతో అన్నారు. ఇలా మూడు పార్టీలు సీఎం కుర్చీ కోసం ఎత్తులు,పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీల నుంచి ఎవరు సీఎం అవుతారో.. కలిసి నిర్ణయించుకోండి” అనేలా ఢిల్లీ పెద్దలు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం మీదే మహారాష్ట్ర సీఎం పదవి ఆధారపడి ఉంటుందన్నట్టు ఆ రాష్ట్ర పెద్దలు అంటున్నారు.నిశితంగా గమనిస్తే..గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫడ్నవీస్ ను పక్కనబెట్టి..శివసేను చీల్చిన శిండేకు సీఎం కుర్చీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తుందా.లేక ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తుందా లేక అజిత్ పవార్ ఛాన్స్ ఇస్తుందా..ఇదేదీ కాకుండా తెరపైకి మరోకరిని తెస్తుందా..? అంతా హైకమాండ్ మీద ఆధారపడి ఉన్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.