తెలంగాణకు మాతృగీతికనందించిన కవితా ఖడ్గధారి

ravella-venkatarama-raoఅభ్యుదయ సాహితీ ఉద్యమ తరానికి చెందిన కవి, మూడు తరాలను అనుసంధానించిన కవి, నిరంతర చైతన్య శీలి. తెలంగాణకు మాతృ గీతికను అందించిన రావెళ్ళ వెంకట రామారావు పేరు నేటి తరం సాహితీకారులకు అంతంత మాత్రమే తెలుసు. కలాన్ని, హలాన్ని, ఆయుధాన్ని మూడింటితోనూ సమర్థవంతంగా, ప్రభావశీలంగా ప్రయాణం చేసిన రావెళ్ళ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు.

”వొత్తరా సర్జన్య దుర్జేయ శంఖమ్ము/ ఎత్తరా వైప్లవ్య వాహినీ కేతనము” అంటూ ఎంతో ఆవేశంతో చైతన్య గీతాలాపన చేసినవాడు రావెళ్ళ. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగానైనా తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన కృషిని, ఆయన రచించిన జానపద గేయ భాషాసాహిత్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
తెలంగాణకు ఒక చారిత్రక సాంస్కృతిక ప్రత్యేకత ఉంది. వెట్టి చాకిరికి, అణచివేతకు, పేదరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం వీరోచితంగా సాగిన యుద్ధ భూమి ఇది. ఆ సమర సన్నివేశాలు, ఆవేశాలు ఇక్కడి కళా సాహిత్యాల్లోనూ విస్తృతంగా మనం చూడగలుగుతాం. అట్లాంటి తెలంగాణ సాయుధ సమర కాలంలో ఆయుధాన్ని, అక్షరాన్ని యెక్కుపెట్టిన యోధుడే మన రావెళ్ళ. పుట్టింది ధనిక భూస్వామ్య కుటుంబమైనా శ్రామికుల జీవితాన్ని, వారి కష్టాలను, కన్నీటిని చిత్రించి మేడిపండు స్వాతంత్య్రంపై చివరి వరకూ నిప్పులు చెరిగిన కర్షక కవి రావెళ్ళ.
”కదనాన శత్రువుల/ కుత్తుకల నవలీల/ నుత్తరించిన బలో/ న్మత్తులేలిన నేల/ వీరులకు కాణాచిరా!/ తెలంగాణ/ ధీరులకు మొగసాలరా! అబలయని దేశమును/ కబళింప తలపడిన/ పర రాజులకు, స్త్రీల/ పటు శౌర్యమును జూపి/ రాజ్య తంత్రము నడిపెరా!/ తెలంగాణ/ రాణి రుద్రమదేవిరా!/ కుల వర్ణ సంకీర్ణ/ కలహాల నిర్జించి/ బోధి సత్వుని ధర్మ/ బోధనల నేర్పింది/ శ్రీ గిరి చైతన్యమ్మురా! తెలంగాణ/ చైతన్యమును చాటిరా!/ కవితలో విక్రాంతి/ కహళిని పూరించి కమ్మ తెనుగున తేట/ కావ్యాల విరచించె/ పాల్కురికి ఆనాడెరా/ తెలంగాణ/ ప్రగతి బాటల తీర్చెరా! భాషావధూ నయన/ భాష్పతతి నణగింప/ రాజ సమ్మాన వైరగ్యమును ప్రకటించి/ కృషికుడై జీవించెరా! తెలంగాణ/ కృష్ణకవి పోతన్నరా!” అంటూ తెలంగాణ వీరత్వాన్ని సాంస్కృతిక చిత్రాన్ని వర్ణించిన తీరు ప్రతి గుండెను కదిలించే విధంగా వుంటుంది. ఈ గీతాన్ని తెలంగాణ పోరాట కాలంలో, ప్రొఫెసర్‌ జయశంకర్‌గారు తెలంగాణ రాష్ట్రమేర్పడితే ఈ గీతమే రాష్ట్ర గీతంగా వుంటుందని, ఇది మా అందరినీ కదిలించిన గీతమని సభలో ప్రకటించారు. అలాంటి గీతాన్ని కానీ, ఆ కవిని గానీ నేడు ఎవరూ ప్రకటించుకోకపోవటం విచారకరం.
ఇక ఆయన జీవిత విశేషాలలోకి వస్తే, 1927 జనవరి ముప్పయి ఒకటిన పుట్టిన రావెళ్ళ రుక్మాంగద కథ, నాగకథ మొదలైన ఎన్నో పురాణ గాథల్ని గానం చేసే తల్లి ఒడిలో నుండే విని ఛందోలయ జ్ఞానాన్ని వారసత్వంగా పొందాడు. వైద్యంతో పల్లెలోని ప్రజలకు సేవ చేసే తండ్రికి సామాన్యులతో ఉన్న సంబంధాలు రావెళ్ళను ప్రజల దగ్గరకు చేర్చింది. తల్లి జానపదం జన సాహిత్యాన్ని పట్టించింది.
నైజాము రజాకార్ల దుర్మార్గాలు, వెట్టి, బానిసత్వం, కూలివాడు తల ఎత్తి చూసినందుకు తన్నులు తినడం మొదలైన అరాచకాలను కళ్ళారా చూసిన రావెళ్ళ ‘కర్నాయా మర్నా’ అని పోరాటంలోకి దూకారు. ఉర్దూలో ఆరవ తరగతి వరకు చదివిన ఆయన 1943-44 ప్రాంతాలలో ఆంధ్రమహా సభ నిర్వహణపై నిర్బంధ సమయంలో రక్షణగా తమ ఇల్లు నిర్వహించిన పాత్రతో తనూ స్ఫూర్తిపొందాడు. 1945లో ఖమ్మంలో జరిగిన ఆంధ్రమహాసభకు విద్యార్థి వాలంటీరుగా పనిచేశారు.
యువకుడుగా వుండగానే కర్ర శిక్షణ పొంది, కృష్ణాజిల్లాలోని పరిటాల గుట్టల్లో తుపాకీ కాల్చడం నేర్చుకున్నారు. అంతేకాదు రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య, సుంకర సత్యనారాయణ, పొట్లూరి సుందరంల దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకుని గోకినపల్లి అల్కా అజ్ఞాత దళానికి కమాండర్‌గా పీడిత రైతాంగ పక్షాన పోరాటంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు కాక పోయినా పీడితుల వైపు నిలబడి కమ్యూనిస్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల నిర్బంధానికిగురయి జైలు జీవితాన్నీ గడిపారు. జైల్లో ఉండగానే ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. అప్పటికీ పోరాటంలో పాల్గొంటున్న దాశరథి సోదరుల పరిచయం కవిత్వంపై ఆసక్తిని పెంచాయి.
తెలంగాణ సాయుధ పోరాటంపై పాటలు, కవితలు రాసి ప్రజలను చైతన్య పరచడంలో రావెళ్ళ విశేష కృషి చేశారు. దాశరథి సోదరుల ప్రభావంతో పాటు శ్రీరామ కవచం సత్యనారాయణ, వట్టికొండ రామకోటయ్య హీరాలాల్‌ మోరియా, కవిరాజమూర్తి మొదలైనవారి సహచరత్వం అతనిపై ప్రభావం చూపింది. జానపద బాణీలో గేయాలు రాయటంలో చాలా పేరు పొందారు. పద్యాన్ని కూడా అత్యంత సంస్కృతి సమాన భూయిష్టంగా రాయగలదిట్ట రావెళ్ళవారు. జానపదంలోనైనా, పద్యంలోనైనా ఉద్యమ స్ఫూర్తిని నింపారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమోనని ఆశ పడ్డా కానీ ఏ విధమైన మార్పు జరగకపోయినా కొత్త సమస్యలు ముందుకొచ్చాయని. ”స్వాతంత్య్రపు నవజవ్వనిని/ సంగ్రహించి దాచుకున్న/ అక్రమ లాభార్జన పర/ చక్రవర్తులైన వారి/ సుకృతగాన మోహ/ వికృతులను వినగలేను/ అరువుపాలు; ఎరువు తిండి/ అర్థాంతపు చేతివాటు/ పస్తులతో జనావళికి / పరాకోటి ఇక్కట్టులు/ పైకొనగా విలవిలమను/ భాగ్యహీన బడుగుజాతి!” అని వాపోయారు.
”మతము పేర తోటినరుల/ కుతక నరుల తగదురా/ హితముగూర్చ లేని మతము/ విడిచిమనుట మేలురా!”
”కులము నేటి పెను భూతం/ కోరతాడ బెరుకురా/ ప్రగతి కోరు బాటలతో/ పయనమొకటి సుఖమురా/”
”అన్న దమ్ములందు కలత/ లున్న చేడు మూడురా/ ఐకమత్యమన్న గొప్ప/ ఆయుధమ్ము తెలియదా” అంటూ 1960ల లోనే కుల, మత, ప్రాంతీయ తత్వాలపై తన కలాన్ని ఎక్కుపెట్టారు.
ఆ రోజులలోనే సామ్రాజ్య వాద ప్రమాదాన్నీ తన కవితలో హెచ్చరిస్తూ రావెళ్ళ అలా అంటాడు…
”సముద్రాల కావల, పడమటి తీరాల, నర మేథోయజ్ఞశీల/ లందున ఆవిర్భూతి/ నందిన హవిస్సులు/ హిప్పీలు, బీటిల్సూ/ కాక్‌టైల్‌ క్లాసిక్సు మానవతా చైతన్యాన్ని మత్తులతో జోకొట్టే/ మంత్రాంగపు కీటకాలు… ప్లానులు, ప్రవచనాలు/ ప్రజావశీకరణౌషధాలు/ సాంస్కృతిక బృందాలు! అన్నపూర్ణ వక్రీకృత/ ఆకటి శోకాలు/ పరభావాను ప్రేరిత/ పరాకాష్ట దినావృత/ ఖండాంతర బేహారుల/ కనుసన్నల బందీకృత. అని విదేశీ పరోక్ష పెత్తనం కిందకు ఎలా మళ్ళుతున్నామో వివరించారు.
సమాజంలోని దుర్మార్గాలపై, అన్యాయాలపై, అసమానతలపై చివరి వరకూ స్పష్టమై భావాల్ని కలిగివున్న వారు రావెళ్ళ. తెలంగాణ ప్రాంతంలో వున్న వీరత్వం గురించి, సాహిత్య, శిల్ప కళావైభవాల గురించి, రాణి రుద్రమ పౌరుషాన్ని గురించి రాసిన గేయం ఇప్పటికీ ఉర్రూతలూగుతారు జనం.
”రాగజ్యోతులు”, ”జీవనరాగం”, ”అనలతల్పం”, ”తాండవహేల” మొదలైన కవితా సంకలనాలను వెలువరించిన రావెళ్ళ కవితలు ఇంకా ఎన్నో అముద్రితాలుగా వున్నాయి. కథలు, నాటికలు, పాటలు, వ్యాసాలు కూడా రాశారు. రేడియో ప్రసంగాలూ చేశారు. 1962లోనే గురజాడ కవితల పోటీ (కాకినాడ)లలో ప్రథమ బహుమతి పొందారు. 1991లో దాశరథి అవార్డు, 98లో జాషువా అవార్డునూ పొందారు. 1941 – 42 ప్రాంతాలలోనే అభ్యుదయ రచయితల సంఘానికి రాష్ట్ర కార్యవర్గంలో, పాలసీ నిర్ణయాక కర్తల్లో పనిచేసిన రావెళ్ళ 1974లో ఖమ్మం జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసి అధ్యక్షులుగా కొనసాగారు. 1999లో జిల్లాలో సాహితీ స్రవంతి ఏర్పడగా, దానికి గౌరవాధ్యక్షులుగా ఆరు సంవత్సరాలు పనిచేశారు. సాహితీ స్రవంతి ప్రతి కార్యక్రమానికీ హాజరయి చక్కని స్ఫూర్తిని అందించిన రావెళ్ళ నలభైలలో సాహిత్యానికి డెబ్బయిలలో వచ్చిన మార్పులకూ తొంభైల తర్వాత వచ్చిన ప్రపంచీకరణ ప్రభావ సాహిత్యానికీ ప్రతి స్పందిస్తూ నినదించిన కవి. ‘సామ్యవాదం కోరుతున్నవాణ్ణి నేను’ అని స్పష్టంగా చెప్పిన రావెళ్ళ వెంకట రామారావు గారి కవితా చైతన్యాన్ని కొనసాగించటమే నిజమైన వారసత్వ పయనం కాగలదు.

– కె.ఆనందాచారి, 9948787660