కేసీఆర్‌ హ్యాట్రిక్‌ గ్యారంటీ

KCR hat trick guaranteed– అధికారంలోకి రాగానే 4 కొత్త పథకాలు : మంత్రి కేటీఆర్‌
– మొయినాబాద్‌, వికారాబాద్‌, మర్పల్లిలో రోడ్‌ షో
నవతెలంగాణ-మర్పల్లి, మొయినాబాద్‌
రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవడం, కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం కావడం గ్యారంటీ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ఎన్నిసార్లయినా అధికారం కట్టబెట్టొచ్చని తెలిపారు. అధికారంలోకి రాగానే నాలుగు కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో గురువారం మంత్రి రోడ్‌ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఏమో కానీ ఆరు నెలలకోసారి సీఎం మారడం పక్కా అని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 111జీఓను రద్దు చేసినట్టు తెలిపారు. 40 ఏండ్ల వికారాబాద్‌ జిల్లా కలను సాకారం చేశామని, దాంతోపాటు వికారాబాద్‌కు మెడికల్‌ కాలేజీ మంజూరు చేసినట్టు తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యేగా కాలే యాదయ్యను, వికారాబాద్‌ ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్‌ను మరోసారి గెలిపించాలని కోరారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు కాలే యాదయ్య, మెతుకు ఆనంద్‌ పాల్గొన్నారు.