కేసీఆర్‌ అసలైన ధర్మ రక్షకులు

– బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సభ్యులు జోషి గోపాలశర్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణ స్థితిగతులు అందరికీ తెలవాలని, అసలైన ధర్మ రక్షకులు కేసీఆరేనని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సభ్యులు జోషిగోపాలశర్మ అన్నారు. శుక్రవారం ఆయన సచివాలయం లోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేరుల సమావేశంలో మాట్లాడారు. 2016లో బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ బ్రాహ్మణ కుటుంబాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ విద్యకు రూ.20 లక్షలు ఇచ్చారని, కొన్ని కుటుంబాలకు పారిశ్రామిక వేత్తలు కావడానికి కూడా నిధులు ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పుష్కరాలు అంటే విజయవాడ, రాజమండ్రి వెళ్ళేవాళ్ళం కానీ రాష్ట్రం వచ్చాక బాసర, భద్రాచలం, గద్వాల్‌, బీచుపల్లి ప్రాంతాలకు వెళ్లామని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని పునరుద్దరించి ప్రపంచ దేశాల దష్టిని ఆకర్షించారని తెలిపారు. కొండగట్టు, వేములవాడ ఆలయాల పునరుద్ధరణ పనులు చేయాలని సూచించినట్టు చెప్పారు. బ్రాహ్మణులకు హైదరాబాద్‌లో భవనం ఉండాలని భావించి గోపన్‌పల్లిలో 6.18ఎకరాల స్థలం కేటాయించారని, ఈ భవనం ఈనెల 31న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలిపారు.