
– గిరిజనులను పట్టించుకోని గత ప్రభుత్వాలు
– సతీష్ కుమార్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
నవతెలంగాణ- హుస్నాబాద్: మన గ్రామం, మన తాండా మన రాజ్యం నినాదాన్ని సీఎం కేసీఆర్ నిజం చేసి మన ఆత్మగౌరవాన్ని పెంచాడని , మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని జిల్లెల్లగడ్డ, వంగరామయ్యపల్లి, బల్లు నాయక్ తండ, మీర్జాపూర్, పోతారం (ఎస్), నాగారం, ఉమ్మాపూర్, మహమ్మదాపూర్ గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిర్వహించారు. గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థికి గిరిజనులు , వివిధ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాలలో వృద్ధులు ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు తిలకం దిద్దుతూ మాకు అండగా నిలవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరి ఆశీర్వాదం తనపై ఉండాలని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి గిరిజనులను ఏ పార్టీ పట్టించుకోలేదని, కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దామని అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టారని, ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తులు, గ్రామ గ్రామానికి రోడ్లు, అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నియోజకవర్గంలో 16విద్యుత్ సబ్ స్టేషన్ లు నిర్మించుకొని ఇళ్లకు, వ్యవసాయ మోటర్లకు నాణ్యమైన 24 గంటల కరెంటు అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 2023 మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రజలకు వివరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కలబొల్లి మాటలు నమ్మవద్దని మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.