అమరుల త్యాగాలతోనే కేసీఆర్‌కు అధికారం..

– వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమరుల త్యాగంతోనే కేసీఆర్‌కు అధికారం వచ్చిందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారు ఎందరో అయితే..సాధించిన తెలంగాణలో కొందరే లబ్దిపొందుతున్నారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సంపదంతా కేసీఆర్‌ పాలవుతున్నదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ఒక్కరింటికే చేరాయని ఎద్దేవా చేశారు. తొమ్మిదేండ్లుగా అమరులపై లేని ప్రేమ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు పుట్టుకొస్తోందని తెలిపారు. రాష్ట్ర సాధనకోసం 15 వందల మంది ప్రాణాలు కోల్పోతే..వారి పేర్లు కూడా తెలుసుకోలేని దుస్థితిలో సర్కారు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ ఆదుకుంటానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఇన్నేండ్లుగా గుర్తుకు రాని శంకరమ్మకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు.