కేసీఆర్‌ హామీలు పక్కాగా అమలు చేయాలి

– ప్రజలను మభ్యపెట్టేందుకే కొత్త తాయిలాలు
– మొద్దు నిద్ర వీడాలంటూ సీఎంకు హితవు : మహాధర్నాలో బీఆర్‌ఎస్‌ పాలనపై టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పరిపాలన తీరు నేడు ఎద్దు మీద వానపడ్డట్టుగా ఉందని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు దాటినా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా సోమవారం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నాం ప్రారంభమైన ధర్నా వర్షం పడుతున్నా కొనసాగింది.రాష్ట్ర నలుమూలల నుంచి ధర్నాకు టీడీపీ శ్రేణులు హాజరయ్యాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్‌ హామీలు పక్కాగా అమలుచేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ ప్రజలకు వాగ్దానం చేసిన హామీలను మర్చిపోయి మొద్దు నిద్రలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే మహాధర్నాను చేపట్టిన్నట్టు చెప్పారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పాలన ఎలాంటిదో మీడియా చూసిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా నాయకులు, కార్యకర్తలపై మీడియాలో అవినీతి, అరోపణల వార్తలు వస్తే, వెంటనే విచారణ కమిటీ వేసి నివేదిక ఆధారంగా బాధ్యులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు ఉండేవన్నారు. ఇప్పటిదాకా కట్టని డబల్‌ బెడ్‌రూం ఇండ్లు, ఇప్పుడు కట్టిస్తానని చెప్పడం సరికాదన్నారు. నాడు లక్షల్లో నిర్మిమన్నారు, కనీసం వేలల్లో కూడా ఇండ్లు కట్టకపోవడం దారుణమని విమర్శించారు. . పేద ప్రజల కోసం కట్టిన ఇండ్లను పంచకుండా, ఎన్నికలకు రెండు నెలల ముందు ఓట్ల కోసం పంచుతున్నారా ? ప్రశ్నించారు. ఎక్కడ చూసినా అభివద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నారనీ, కానీ రాష్ట్ర బడ్జెట్‌ జీరోనేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రజలు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో బీదలకు పక్కా ఇండ్లు, జనతా వస్త్రాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం, సబ్సిడీ విద్యుత్‌, మహిళలకు ఆస్తి హక్కు, గురుకుల పాఠశాలలు, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్ధిక వనరులు పెంచింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడేనని, మున్సిపాలిటీల్లో మిగులు బడ్జెట్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందించిన ఘనత ఆయనదేనని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, జాతీయ అధికార ప్రతినిధి టి.జ్యోత్స్న జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపి ఎప్పుడు అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పోరాడుతున్నదన్నారు. టీడీపీ నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి, పథకాల తెచ్చి నెరవేర్చకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మహాధర్నాలో తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, జాతీయ కార్యదర్శి కాసాని విరేష్‌, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, సామా భూపాల్‌ రెడ్డి , మూర్తి, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్‌, గంగాధర్‌ రావు, ముప్పిడి గోపాల్‌ ,ఆరీఫ్‌, జీవీజీ నాయుడు , బండారు వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు సూర్యదేవర లత, రామేశ్వర రావు, శ్రీనివాస్‌ నాయుడు, బిల్డర్‌ ప్రవీణ్‌, ఎస్వీ కష్ణ ప్రసాద్‌, అనూప్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు యం.బిక్షపతి ముదిరాజ్‌ , సంధ్య పోగు రాజశేఖర్‌ ,పుట్టి రాజు,రవీంద్రా చారి, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు పి.సాయిబాబా, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.