పోరాటాన్ని కొనసాగించు..

పోరాటాన్ని కొనసాగించు..– ప్రబీర్‌ పుర్కాయస్థ స్వీయ జీవిత చరిత్ర)
న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ వ్యవస్థాపక సంపాదకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ స్వీయ జీవిత చరిత్ర ‘కీపింగ్‌ అప్‌ ది గుడ్‌ ఫైట్‌’ పేరుతో వెలువడింది. దేశాన్ని ప్రభావితం చేసిన సంఘటనలతో పాటూ ఆయన జీవిత కథను, ఆ మార్గంలో ఆయన నేర్చుకున్న పాఠాలను 200పేజీలతో వెలువడిన ఈ పుస్తకం మనకు తెలియచేస్తుంది. అధికార మదాన్ని ధీటుగా ఎదురొడ్డి నిలిచిన జాతి కథతో పుర్కాయస్థ తన వ్యక్తిగత జీవిత కథను అల్లుకున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ”భారత రిపబ్లిక్‌కు ఎంత వయస్సు వుందో నాకు కూడా అంతే వయస్సు వుంది. ఈ 75ఏళ్ళ జీవితంలో నేను నేర్చుకున్న వాటిని గురించి సులభంగా చెప్పాలంటే, ‘సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన నా దేశంలో ఎలా భాగం కావాలో నేర్చుకున్నాను, అదే స్థాయిలో, అద్బుతమైన, మరింత సంక్లిష్టమైన ఈ ప్రపంచంలో భాగం కావడం నేర్చుకున్నా, అందరి కోసం మరింత మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు నేను పోరాడాల్సిన అవసరం వుందని గుర్తించా.” అంటారు.
1975 ఎమర్జన్సీ సమయంలో పట్టపగలే కిడ్నాప్‌ అయినపుడు కానీ, ఈ ఏడాది అక్టోబరు 3న అరెస్టయినపుడు గానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, తాను బాధితుడిని అనే కోణం నుండి చూసుకోవడానికి ఇష్టపడనని ప్రబీర్‌ పుర్కాయస్థ అంటారు. ఎందుకంటే, చరిత్ర సృష్టిలో భాగస్వామ్యాన్ని భాదితత్వం దోచేస్తుంది, మనల్ని కేవలం చరిత్రలో వస్తువులుగా మార్చేస్తుంది. దానికి బదులుగా, చరిత్ర సృష్టికర్తలుగా ప్రజలు వుండాలని నేను అనుకుంటాను. ఆ రోజున అధికారంలో వున్న ప్రభుత్వం వ్యక్తులపై, సంస్థలపై ఆధిపత్యం చెలాయించినట్లు కనిపిస్తుంది. కానీ అంతిమంగా చరిత్రను నిర్ణయించేంది ప్రజలు, వారి చర్యలే, అంతేకానీ, మనకు నచ్చినపుడు, మనకు ఇష్టమైనట్లుగా కాదు, ప్రజలు గానీ వారి పాలకులు గానీ ఊహించని రీతిలో వుంటుంది.” అని ఆయన పేర్కొంటారు.
సరళమైన, స్పష్టమైన భాషతో సాగిన ఈ జీవిత చరిత్ర కథనం ఎక్కడా బోర్‌ కొట్టదు, తనకు తాను గురించి గొప్పలు చెప్పుకోదు. తన జీవితంపై యోధుని పరిశీలనగా వుంటుంది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన వారి గురించి వుంటుంది. తన పట్ల సరిగా వ్యవహరించని వ్యక్తులను కూడా విలన్లుగా చిత్రీకరించలేదు. వారందరూ కేవలం పరిస్థితులకు బానిసలనే ఆయన వ్యాఖ్యానిస్తారు. సైన్స్‌, టెక్నాలజీ, రాజకీయాలు ఈ మూడు రంగాలు తనకు ఎంతో ఇష్టమైనవని ఆయన అంటారు. ‘ప్రతీ తరం ఎమర్జన్సీని ఎదుర్కొనాల్సిందేనా’ అన్న శీర్షికతో గల అధ్యాయంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. ప్రజల మౌనాన్ని అంగీకారంగా భావించరాదని ఆయన చివరగా హెచ్చరిస్తారు.