కేరళ ప్రభుత్వం మరో ఘనత

పట్టణ ఉద్యోగ పథకంలో 41 లక్షల పనిదినాలు
తిరువనంతపురం: కేరళలో ని వామపక్ష ప్రభుత్వం 2010లో ప్రారంభించిన అయ్యం కళి పట్టణ ఉపాధి హామీ పథకం (ఏయూఈజీఎస్‌) దేశానికే దిక్సూచిగా నిలిచింది. సంవత్సరా నికి కనీసం వంద రోజుల పని కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకంలో 2.79 లక్షల మంది లబ్దిదారులుగా నమోదయ్యారు. ఈ పథకం కింద 2022-23లో రూ.113.93 కోట్లు ఖర్చు చేసి 41.11 లక్షల పనిదినాలు కల్పించారు. పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పనిదినాలను కల్పించడం ఇదే మొదటిసారి. మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం రూ.24.4 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించారు. 11వ ప్రణాళికా కాలంలో (2007-11) కేరళ ప్రభుత్వం పట్టణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టింది. పట్టణ జనాభాకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. వారికి బలమైన, హక్కుతో కూడిన సామాజిక భద్రతను కల్పించడమే దీని ఉద్దేశం. పథకంలో ఏయే పనులు చేపట్టాలో స్థానిక సంస్థల వార్డు సభల్లో నిర్ణయిస్తారు. ఈ పథకంలో ‘లైఫ్‌’ మిషన్‌ కింద గృహ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ఇటీవలే చేపట్టింది. దేశంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి అని కేరళ మంత్రి ఎంబీ రాజేష్‌ చెప్పారు. ఈ పథకం కింద దినసరి వేతనాన్ని కూడా పెంచుతున్నారు.