కేతు విశ్వనాథ్‌రెడ్డి కన్నుమూత

– కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత, రాయలసీమ కథారత్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (84) సోమవారం తెల్లవారు జామున 5.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య పద్మావతమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కథకునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా నిరంతర సృజనశీలిగా సుప్రసిద్ధులైన ఆయన 1939 జులై పదిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగసాయిపురంలో కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. విశ్వనాథరెడ్డి అంత్యక్రియలు ఆయన సొంతూరులో మంగళవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఆయన మృతికి ఏపీ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
రాయలసీమ వేదనలకు అక్షరరూపమివ్వడంలో
ఆయనది గొప్ప ముద్ర : తెలకపల్లి రవి, కెంగార మోహన్‌
భారతీయ సాహిత్యంలో తెలుగు కథను ఉన్నత శిఖరానికి చేర్చిన కథకుడు కేతు విశ్వనాథరెడ్డి మరణం తీరని లోటని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్షులు కెంగార మోహన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సంతాప ప్రకటన విడుదల చేశారు. సాహితీ స్రవంతికి ప్రారంభం నుంచి తోడ్పాటునందించి సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో అనేక కథలు, వ్యాసాలు అందించారని, కథా సాహిత్యంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేశారని అన్నారు. అభ్యుదయ రచయితల ఉద్యమంలో విశాలాంధ్ర ప్రచురణాలయంలో కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. పాఠ్యపుస్తకాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయ సిలబస్‌ను రూపొందించడంలో భాష మాండలిక ప్రయోగాల అధ్యయనంలో రాయలసీమ వేదనలకు అక్షర రూపమివ్వడంలో ఆయనది గొప్పముద్ర అని పేర్కొన్నారు. కేతు విశ్వనాథరెడ్డి మరణం పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు.
కేతు విశ్వనాథరెడ్డి మరణం పట్ల తెలంగాణ సాహితి సంతాపం
అభ్యుదయ సాహిత్యోద్యమ నాయకుడు, ప్రసిద్ధ కథా రచయిత, పరిశోధకులు, విమర్శకులు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ సాహితి తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్థన, ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు, అమానవీయ వ్యవస్థకు, మతతత్వానికి వ్యతిరేకంగా సాహిత్య సృజన చేసి, ఎంతోమంది రచయితలకు ప్రేరణనిచ్చిన విశ్వనాథరెడ్డి నిబద్ధత, నిజాయితీ కలిగిన సాహిత్యకారుడని పేర్కొంటూ వారు జోహార్లర్పించారు.
తీర్చలేని లోటు : సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరు గౌరీశంకర్‌
ఆధునిక తెలుగు సాహిత్య దిగ్గజ కథా రచయిత కేతు విశ్వనాథరెడ్డి మరణం సాహిత్య రంగానికి తీరని లోటని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరు గౌరీశంకర్‌ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అకాడమీ కార్యాలయంలో విశ్వనాథరెడ్డి చిత్రపటానికి జూలూరు పూలమాలవేసి నివాళులర్పించారు. పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన విశ్వనాథరెడ్డి… అధ్యాపకుడిగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారని తెలిపారు. పాఠ్య పుస్తకాల రూపకల్పనలో సంపాదకుడిగా వ్యవహరించారని వివరించారు.
ఒక మంచి ఆత్మీయుడిని కోల్పోయా
-ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ
విశ్వనాథరెడ్డి మరణంతో ఒక మంచి మిత్రుడిని, ఆత్మీయుడిని కోల్పోయానని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఇరవై ఏండ్ల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మహాసభల నిర్వహణలో విశ్వనాథరెడ్డి విశిష్ట పాత్రను పోషించారని తెలిపారు.
అరసం సంతాపం…
విశ్వనాథరెడ్డి మరణం పట్ల తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్వీ రామారావు, డాక్టర్‌ రాపోలు సుదర్శన్‌ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. అరసం పునర్నిర్మాణం తర్వాత కార్యవర్గ సభ్యులుగా, అధ్యక్షులుగా,అధ్యక్షవర్గ సభ్యులుగా ఆ సంఘం నిర్మాణానికి తీవ్రంగా కృషి చేశారని పేర్కొంటూ నివాళులర్పించారు.