ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కష్ణ మోహన్
నవతెలంగాణ- సంతోష్ నగర్
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కష్ణ మోహన్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జనరల్, ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకులు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను కొంతమందిని రెగ్యులరైజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఇంకా కొద్దిమంది క్రమబద్దీకరణ కాలేదని పేర్కొన్నారు. వారికి కూడా తగిన సడలింపులివ్వాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 184 మంది ఒకేషనల్ కాంట్రాక్టు లెక్చరర్లను మాత్రమే క్రమబద్ధీకరించారని వివరించారు. ఇంకా 417 మందిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సుమారు 823 మంది కాంట్రాక్టు అధ్యాపకులు 20 ఏండ్లుగా పనిచేస్తుంటే, కేవలం 270 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేశారని మండిపడ్డారు. వివిధ కారణాలతో 553 మంది కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరణ కాలేదని తెలిపారు.
డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు
రాష్ట్రంలో 494 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు నెట్, సెట్, పీహెచ్‌డీ అదనపు విద్యార్హతలు లేవనే కారణంతో క్రమబద్ధీకరణ జాబితాలో చేర్చలేదని వి.కష్ణ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మిర్యాలగూడలోని కేఎన్‌ఎం అన్‌ఎయిడెడ్ డిగ్రీ కళాశాలను 2018, ఏప్రిల్ ఆరో తేదీన జీవోనెంబర్ 10 ప్రకారం స్వాధీనం చేసినపుడు 18 మంది బోధన సిబ్బంది, అదనపు విద్యార్హతతో నెట్, సెట్ మినహాయింపుతో తీసుకుని రాష్ట్ర పేస్కేళ్లు ఇచ్చారని గుర్తు చేశారు. 2022 జులై 23న జీవో 27 ద్వారా చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబ్‌నగర్ అన్ ఎయిడెడ్ కాలేజీని స్వాధీనం చేసినపుడు 8 మంది బోధనా సిబ్బందికి నెట్, సెట్ అదనపు విద్యార్హతలో మినహా యింపులిచ్చి రాష్ట్ర పేస్కేల్లు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మిగిలిపోయిన వారికి కూడా ఐదేండ్ల కాలపరిమితినిచ్చి క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.
2014 జూన్ రెండో తేదీ కంటే ముందే 33 మంది కాంట్రాక్టు అధ్యాపకులుగా కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నెట్, సెట్, పీహెచ్‌డీ సంపాదించారని పేర్కొన్నారు. కానీ క్రమబద్ధీకరణ జాబితాలో వారి పేర్లు ఉన్నత విద్యాశాఖకు అందలేదని పేర్కొన్నారు. 2014 జూన్ రెండో తేదీ తర్వాత 26 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నారని, నెట్, సెట్, పీహెచ్‌డీ విద్యార్హతలున్నాయని, వారికి సడలింపులివ్వాలని కోరారు.
జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులరైజ్ కాకుండా మిగిలిపోయిన సుమారు 417 మంది ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను మంజూరు చేసి, అర్హతల్లో సడలింపులిచ్చి క్రమబద్ధీ కరించాలని కష్ణ మోహన్ కోరారు. జనరల్ కోర్సుల్లో పనిచేస్తున్న 23 మందికి అవార్డ్ ఆఫ్ పాస్ డివిజన్ సమస్య ఉందని పేర్కొన్నారు. అలాగే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) బోధిస్తున్న 15 మంది కాంట్రాక్టు అధ్యాపకుల విషయంలో 60 శాతం మార్కులు దాటి ఉన్నప్పటికీ ‘అవార్డ్ ఆఫ్ పాస్’ డివిజన్ లేదనే కారణంతో రెగ్యులరైజ్ చేయలేదని తెలిపారు. వారి విషయంలో మార్కులను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరించాలని కోరారు.