ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌

చండీగఢ్‌ : ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ను మోగా జిల్లాలో పంజాబ్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. మార్చి 18 నుంచి అమృత్‌పాల్‌ సింగ్‌ సుమారు 37 రోజులుగా తప్పించుకు తిరుగుతన్న సంగతి తెలిసిందే. అతని కోసం పంజాబ్‌ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆదివారం ఉదయం మోగా పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అమత్‌పాల్‌ను అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించనున్నారు. ప్రస్తుతం అదే జైల్లో అతడి అనుచరులు కూడా ఉన్నారు. అయితే అమృత్‌పాల్‌ అరెస్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమృత్‌పాల్‌ స్వయంగా పోలీసులకు లొంగిపోయినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాలను పంజాబ్‌ పోలీసులు ఖండించారు. మార్చి 18న పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌ తెలిపారు. పంజాబ్‌ పోలీసుల అన్ని విభాగాలు సమన్వయంతో అతని కోసం గాలించాయని, ప్రతి కదలికను ట్రాక్‌ చేశాయని చెప్పారు. దీంతో రోడ్‌ గ్రామంలో అమత్‌ పాల్‌ ఉన్నట్లు నిర్థిష్ట సమాచారం వచ్చిందని అన్నారు. అమృత్‌సర్‌ పోలీసులు, పంజాబ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల సంయుక్త బందం గ్రామాన్ని చుట్టిముట్టిందని, భారీగా భద్రతా బలగాలను మోహరించామని చెప్పారు. అతను గురుద్వారా లోపల ఉన్నందున ..
ఆ స్థలం పవిత్రత దష్ట్యా పోలీసులు లోపలికి ప్రవేశించలేదని అన్నారు. దీంతో తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో అమత్‌పాల్‌ సింగ్‌ గురుద్వారా నుండి బయటికి వచ్చిన వెంటనే అరెస్ట్‌ చేశామని స్పష్టం చేశారు. పోలీసులు అరెస్టు చేశామని చెబుతుండగా.. రోడెవాల్‌ గురుద్వారాలోని జ్ఞానీ జస్బీర్‌ సింగ్‌ మాత్రం భిన్నంగా చెబుతున్నారు. శనివారం రాత్రి అమృత్‌పాల్‌ గురుద్వారాకు వచ్చాడని, తాను ఎక్కడ ఉన్నదీ పోలీసులుకు అతనే స్వయంగా ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడని అన్నారు. ఆదివారం గురుద్వారాలో ప్రార్థనల అనంతరం ఉదయం 7 గంటలకు లొంగిపోనున్నట్టు వెల్లడించారన్నారు. ఉదయం 7గంటల సమయంలో ఇంటెలిజెన్స్‌ ఐజీ నేతత్వంలోని పోలీసులు అక్కడకు చేరుకొని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు.