మహిళలకు రిజర్వయితే ఖమ్మం సీటు త్యాగం

– ప్రభావితం చేయగల మహిళలకు చాన్స్‌ : మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వచ్చే ఎన్నికల్లో మహిళలకు ఖమ్మం సీటు రిజర్వ్‌ అయితే తాను వారికి ఇచ్చేందుకు సిద్ధమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్‌ హామీ ఇచ్చారు. అలా అని తన భార్యనో, కోడలినో పోటీలో నిలపనని స్పష్టంచేశారు. ప్రభావితం చేయగల మహిళలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలనేది తన భావనగా చెప్పుకొచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం గృహలక్ష్మి, జీవో 58 ఇండ్ల పట్టాల పంపిణీ సందర్భంగా పువ్వాడ మాట్లాడారు. చట్టసభల్లో 33శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా అక్కచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆకాశంలో సగం.. సమాజంలో సగమన్నారు. ఇంతకాలం కోట్లాడిన తర్వాతైనా మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం హర్షనీయమని తెలిపారు. ఖమ్మం సీటు వచ్చేసారి మహిళలకు రిజర్వేషన్‌ అయితే సంతోషించే వాళ్లలో తాను ముందుంటానన్నారు. అలా అని తన ఇంట్లో నుంచి తన భార్య, కోడలునో పోటీ పెట్టనని హామీ ఇస్తున్నట్టు ప్రకటించారు. సమాజంలో ప్రభావితం చేయగలిగిన మహిళలకు పోటీ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. తానూ కేటీఆర్‌ బాటలోనే సీటు త్యాగం చేసేందుకు సిద్ధమన్నారు.