నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందేలా చేసిన ప్రధాని మోడీకి రాష్ట్ర మహిళలు అండగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎంఐఎం పార్టీ ఒక్కటే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌కు ఓవైసీ గురువు అనీ, ఆ గురువు చెప్పినట్టే కేసీఆర్ వింటారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు వెనుకబడ్డారని విమర్శించారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, మహిళా నాయకురాలు జయసుధ మోడీకి ధన్యవాదాలు తెలిపారు.