నల్లమల సిగలో విరిసిన కొండమల్లెలు

Kondamalle blossomed in the black sigaఏ వైఎన్‌ Rand  అను శాస్త్రవేత్త నిర్వచనం ప్రకారం భూమి మీద పుట్టిన ఎటువంటి తెగ వారైనా, అది ఎంత చిన్నదైనా వారికి ఈ పుడమిపై స్వతంత్రంగా జీవించే హక్కు ఉంటుందనేది నిర్వివాద అంశం. దీనికి తగినట్లుగానే కొండ కోనల్లో సంచరించే తెగకు చెందినవారు చెంచులు. వీరి జీవన ఇతివృత్తాన్ని స్వీకరిస్తూ ఆదివాసీ నవలా రచనకు పూనుకున్న డాక్టర్‌ దిలావర్‌ అభినందనీయులు. ఎందుకంటే వీరి దైనందిన జీవనసరళిని అతి సామమీప్యంలో ఉంటూ గమనించ గలగటం, తాను వృత్తి గత బాధ్యతలు నిర్వహించిన వివిధ కోయగూడేలు వాటి పరిసర ప్రాంతాలు వీరి నవలా రచనకు ఎంతో దోహదపడుతూ ఈ ‘అడవి బతుకులు’కు జీవం పోసిందని అనిపిస్తుంది.

నల్లమల్ల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. ఈ ప్రాంతం తెలంగాణాకు గుండెకాయలాంటిది. ఇది చెంచులకు ‘మనాకీ’ అయిన ప్రాంతం. అంటే చెంచుల జీవం, ప్రాణం. వారికి నీడనిచ్చే ఆవాసం, భుక్తి తీర్చే అన్నపూర్ణ. అలాగే పర్యాటక ప్రియులను తన సొగసైన రూప లావణ్యాలతో కౌగలించుకొని ముద్దులు ఇచ్చే జవరాలు ధన్వంతరీ వారసులకు ప్రాణధారలు పోయ గల అమృతవర్షిణి. పర్యావరణ ప్రేమికులకు జీవవైవిధ్యాన్ని సంరక్షించే జీవనప్రదాయిని. ఇంతటి మహత్తు కలిగిన నల్లమలలో నేడు నడుస్తున్న వర్తమాన వ్యవహారాలే నల్లమలను, అందు నివసించే చెంచులను పొట్టన పెట్టుకుంటూ అనకొండలా చుట్టుకుంటున్న ప్రభుత్వ, మానవ, దానవ కబళిత విన్యాసాలై నగర జీవనంలోకి నిర్దాక్షిణ్యంగా విసిరి వేయబడుతూ ఖాళీ సంచులుగా, డొల్లతనంతో జీవనం సాగి స్తున్న వారి దుర్భర స్థితిగతులు వెరసి మసిబారిపోయి కళ్లను చించుకున్నా ఏమీ కనబడని ఓ గుడ్డి దర్పణం.
సంతోషపూరిత జీవితాన్ని గడుపుతున్న వీరి జీవనాన్ని నేటి ఆధునిక మానవజాతి తమ స్వార్థ దాహానికి బలిపెడుతూ విధ్వంసం వైపుగా నెడుతోంది. ఇటు తమను బతికించే అడవులు లేక అటు నాగరిక జీవితంలో ఇమడలేక అర్ధాంతరంగా మృత్యుదేవత ఒడిలోకి లాగబడుతున్నారు చెంచులు. వీరు నివాస గూడేన్ని ‘పెంట’గా వ్యవహరిస్తారు. చదువు, సంస్కారం మా సొత్తే అని విర్రవీగుతూ మీసాలు మెలేసే మనం.. మనలో లేని సుగుణాన్ని వీరిలో ప్రస్ఫుటంగా గమనించవచ్చు. వేటపడినా లేదా మడుగులో చేపల్ని పెద్ద మొత్తంలో పట్టినా ఏ కొద్దిమందో తినకుండా ఆ పెంటలోని కుటుంబాల వారంతా సమభాగాలుగా పంచుకుని తినటం ఈ తెగవారి ఐక్యతకు, వారిలో నిండిన అభిమానానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు.
ఒకప్పుడు అడవిలో అడవిలా మమేకమైపోయిన చెంచులు నిర్వాసితులు అవ్వటం అంటే తల్లి పేగు బంధాన్ని తెంపుకున్నట్లే. కానీ ఇలా తెంపుకోవటం వీరికి సాధ్యమయ్యే పని కాదని నవలా నాయకుడు రమణారావు ద్వారా పలికిస్తారు నవలా రచయిత. అటవీ రక్షణ పేరుతో ప్రభుత్వాలు మైదాన ప్రాంతాలకు తరలించి ఎంత పునరావాసం కల్పించినా చరిత్ర పునరావృతమే అవుతుం దంటారు. ఈ ప్రక్రియలో వందలాది సంఖ్యలో అమాయక చెంచుల ప్రాణాలను హరిస్తున్న ఘనత నేటి ప్రభుత్వాలదీ, ఈనాటి స్వార్థపూరిత దాహార్తిదే. ముంతెడు నీళ్లకే ఉలికిపడితే పొంతెడు నీళ్లు ఎవరు పోసుకోవాలి’ అని రచయిత ఒక చమత్కార బాణాన్ని విసురుతూ ఆలోచింపజేస్తారు పాఠకులను.
‘తాటాకు దొబ్బిండు వాడు ఈతాకు నిచ్చిండు చూడు’ అని ఒక సినీ గేయం స్మరణకు వస్తుంది, పాలకుల తంతు చూస్తుంటే. అభివృద్ధి చెందించాలనే నెపంతో చెరువులోని చేప పిల్లల్ని తీసుకెళ్లి ఒడ్డున పడేసినట్లుగా నగరాలలో పునరావాసం కల్పించి వీరికి కనీస సౌకర్యాలను కల్పిస్తున్న మాట వాస్తవమే గాని కన్న తల్లి పేగు బంధం తెంచుకోవడం సాధ్యంకాక నలిగిపోతున్నారు. నూటికి నూరుపాళ్లు నిజమదే.
కన్న వాళ్ళ ప్రేమ ముందు, ఉన్న ఊరిచ్చే సౌఖ్యం ముందు మీదుమిక్కిలి తమకట్టుబాట్లను సంస్కృతీ సాంప్రదాయాలను వదులుకోలేక ఒడ్డునపడ్డ చేపపిల్లల మాదిరిగా గిలగిల్లాడుతూ మత్యువాత పడుతున్నారు చెంచులు. అభివృద్ధి అంటే ఇదేనా? అని మానవ కులమంతా ప్రశ్నించుకోవలసిన గడ్డు పరిస్థితి ఇది. ఎటువంటి ఆత్మ వంచనకు తావివ్వకుండా మనసు చెప్పే జవాబు వినగలిగే ఓర్పు ఉన్నవారికి అడవి అంటే చెంచులు. చెంచులంటే అడవి అని తప్పక ఒప్పుకుంటారు.
కూలీల సమాధుల మీద నుండే ఆధునిక దేవాలయపు (నాగార్జునసాగర్‌ ఆనకట్ట) పునాదులు వెలిసాయి అంటాడు రమణారావు. నిజమే అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసం స్వాగతిం చదగినది కాదు. అభివృద్ధేమో బడాబాబులకు, విధ్వంసం మాత్రం పేద, బడుగు, బలహీన వర్గాల వారికి. ఇదే కదా! చరిత్ర చాటిన నిజం అని కూడా పలికిస్తారు రచయిత నవలా నాయకునితో (రమణారావుతో)
సందర్భానుసారంగా మధ్యమధ్యలో చెంచుల సాంప్రదాయా లను వారిలోని నేటి చిక్కని నిజాయితీని తెలుపుతుంటారు రచయిత. ఈ తీరు చూస్తుంటే చెంచుల పట్ల వారి జీవన విధానం పట్ల గౌరవభావాన్ని పెంపొందిస్తుంది మనకు. చెంచులు నాలుగు రకాలని, వారు అడవి చెంచులు, దేవ చెంచులు, బొంత చెంచులని వీరిలో 26 గోత్రికులు ఉంటారని సగోత్రీకులు ఎప్పుడూ వియ్యమందుకోవటం ఆచారం కాదని ఇలా చెప్తుంటే.. వీళ్లు మనకంటే ఎందులోనూ తీసిపోరని కేవలం విద్య, విజ్ఞానం ఆధారంగా వీళ్లను తక్కువగా అంచనా వేస్తున్నాం. ఇది ఎంత వరకు సబబని మనల్ని మన అంతరంగం ప్రశ్నించకపోదు?
తాటికల్లు, ఇప్ప సారా, తుమ్మ సారాలు సమీకరించుకొని దాచుకోవటం, రోజూ తాగటం అతి సాధారణమైన విషయం వీరిలో. డబ్బులతో కొనుక్కోకుండా స్వయంశక్తితో సాధించుకుం టారు వీటిని. మనకు టీ, కాఫీలు ఎలాగో ఈ తెగవారికి ఇది కూడా అలాగే. ఈ వ్యసనాలనేవి తొడుక్కున్న చొక్కాల్లాంటవి. చొక్కా అందంగా ఉన్నప్పుడు విప్పి విసిరి పారేయాలని ఎవరూ అనుకోరు కదా! మనం బలవంతంగా వదుల్చుకుంటేనే తప్ప వదలనివి ఈ వ్యసనాలు. వీటిని దూరం చేసుకోలేక బతుకుల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అవిద్య అనే కట్లపాముకు చుట్టబడిన శాపగ్రస్త జీవితాలు వీరివి.
పండంటి పాపాయిలకు జన్మనివ్వాల్సిన తరుణంలో నాటు మంత్రసానుల చేతుల్లో పడి ప్రాణాలు హరీమనటం ఆదివాసి మహిళల్లో చూస్తాం తరచుగా. ఇది చాలా విచారకరం. కొండ కచో ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వచ్చిందేమో గాని ఎక్కువ శాతం ఇప్పటికీ ఇలాగే బండి నడుస్తున్నట్లుగా మనం పేపర్లలో న్యూస్‌ చదివినప్పుడు హృదయం చలించిపోతుంటుంది.
ఈ నవలా రచనలోని ఆధ్యాత్మిక కోణం…
”చెట్టులెక్కగలవా ఓ నరహరి ? గుట్ట లెక్కగలవా? ఓ నరహరి! చెట్టు లెక్కగలనే .. ఓ చెంచిత గుట్టలెక్కగలనే..” అనే సినీగీతం యదార్ధమేనండోరు. ఒకప్పటికి చెందిన ఈ నరహరి, చెంచితలే ఇప్పటి శ్రీశైలక్షేత్రంలో భక్తులతో కొలవబడుతున్న మల్లిఖార్జున స్వామి భ్రమరాంబికా దేవిలని వీరి నమ్మకం. వీరి ఆరాధ్య దేవతలు కూడానూ. ఈ దేవాలయ నిర్మాణం చేపట్టింది కూడా మొదట చెంచుజాతి వారేనని రమణారావు ద్వారా చెప్పిస్తాడు రచయిత. నరసింహస్వామి జాతరలో దొంగల దోపు ఉత్సవ తంతును చేస్తారు ఇప్పటికీ.
శివాజీ అంతటి చక్రవర్తి కూడా ఒకానొక సందర్భంలో చెంచుల ఆశ్రయంలో ఉంటూ శత్రుసంహారానికి తగిన యుద్ధ కళలతో పాటుగా తక్కువ ఆయుధాలతో ప్రత్యర్థులను మట్టు పెట్టడం లాంటి విద్యలలో ఆరితేరాడట. దీనికి కృతజ్ఞతగానే నల్లమల అడవుల్లో మల్లన్న క్షేత్రంలో శ్రీశైలం గోపురాన్ని నిర్మించి నాడట. ఇది చారిత్రక సత్యం. ఈ సత్యాన్ని తమ పరిశోధన ద్వారా వెలికితీసి పాఠకులకు అందించిన రచయిత దిలావర్‌ మిక్కిలి అభినందనీయులు.
బిర్సా ముండా, కొమురం భీమ్‌, రాంజీ గోండ్‌ మొదలగు ఆదివాసీల రక్తతర్పణంతో పునీతమైనది గోండ్వాణా రాజ్యం. ఈ గోండ్వాణాలు ఎవరో కాదు. మూలవాశీల స్వేచ్ఛా ప్రవృత్తికి ప్రతి బింబాలే. వీరుతమ ఆత్మగౌరవాన్ని, ఉనికిని స్థిరపరచుకునే దిశగా చేసిన పోరాటాల ఫలితమే గోండ్వాణా కదా! ఇలా వీరి వీర గాథలు, పురాణ గాథలు, త్యాగార్పణలు పఠితలలో ఎంతో ఆసక్తిని రేకెత్తించే విధంగా నవలీకరించారు రచయిత.
అడవిని రక్షించాల్సిన ఫారెస్ట్‌ వాళ్లే చెంచులను, వారి జీవన విధానంపై దెబ్బకొట్టే విధంగా అధికార దుర్వినియోగం చేయటం చూస్తుంటే వీరి పైత్యం ఎంతగా పెచ్చుమీరి పోయిందో తెలియ జేస్తుంది. స్వార్థం వెయ్యికాళ్ల జెర్రిలా పట్టి పల్లార్చుతున్నది కదా అని పలికిస్తారు రమణారావు పాత్ర ద్వారా.
గత అనుభవాల్ని గుణపాఠాలుగా స్వీకరిస్తూ కొత్త పాఠం నేర్చుకుంటూ ముందడుగు వేయగల సమాజానికే కదా! అభివృద్ధి సాధ్యమయ్యేది.? ఎట్టకేలకు పౌర సంక్షేమాన్ని కాంక్షించే వివిధ రకాల సంఘాలు చేపట్టిన ఆలోచనా భరిత కార్యక్రమాల ద్వారా చెంచుల్లో ఉన్న అమాయకత్వం తొలగి స్తబ్దత స్థానే పురివిప్పిన చైతన్యం తాండవిస్తూ వారంతా కలిసి జంగ్లా తోళ్ళతోటి పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా నవలను మలిచిన తీరు అదనపు ఆకర్షణ ఈ రచనకు.
”మా ఆదివాసీల రక్షణ చట్టాలు మాకు తెలుసు ‘పెసా’ లాంటివి.” అంటూ పెంటవాసులంతా ఓ (సరిహద్దు రేఖను) బెర్రను గీసి ”దీన్ని దాటి వస్తే మేము ప్రాణాలకు తెగించి అయినా మా అడవి తల్లిని కాపాడుకుంటాం. బాణాలు ఎక్కు పెడతాం” అని గర్జిస్తారు. శక్తి సింహాల మాదిరిగా జూలు విదిల్చి రణ నినాదాలు చేస్తారు. దీన్ని చూసి భయకంపితులైన జంగ్లా తోళ్లు పలాయనవాదం పఠిస్తారు. వివిధ సంస్థలకు కొమ్ముకాస్తూ అడవిలోకి దూరిన మహామాయగాళ్లు సైతం తోక ముడుస్తారు. ఇలా విజ్ఞాన దాయకమైన చైతన్యభరితమైన సందేశాత్మక ముగింపుతో నవల పాఠకుల మనోమందిరాన్ని చేరుతుంది.
అమెరికాలోని రెడ్‌ ఇండియన్లకు పట్టిన దుస్థితి మన దేశపు మూలవాసీలైన చెంచులకు పట్టకుండా అభ్యుదయవాది రమణారావు అతని శిష్యబృందం ద్వారా వారిని జాగ్రత్త పరచడం, ముఖ్యంగా యురేనియం దాని నుండి విడుదలయ్యే అణు ధార్మికత కారణంగా చికిత్సే లేని ప్రమాదకరమైన జబ్బులు ప్రబలి అవి మానవజాతిని ఎలా కబళించేది, రోగనిరోధక శక్తిని క్షీణింప చేస్తూ ఇటు పంట భూముల్లోనూ, ప్రాణులన్నింటిలోనూ (మానవులతో సహా) సంభవించే వంధ్యత్వాన్ని గూర్చి సవివరంగా రచయిత విశదపరచిన తీరు ఎంతో అబ్బురపరుస్తుంది.
ఎంతో విజ్ఞానవంతమైన విలువైన చక్కని ఈ నవలను చదివిన పాఠకులు స్వయంగా ఈ సారాన్ని అనుభూతించాల్సిందే. ఈ నవలా రచనను వెలువరించటంలో రచయిత తీసు కున్న ప్రత్యేక శ్రద్ధాసక్తులు, జిజ్ఞాసతో కూడిన వీరి అధ్యయనాన్ని అభినం దించాల్సిందే. ఇలాంటి మరిన్ని విజ్ఞానపూరిత, చారిత్ర కంగా అడుగున పడి పోయిన వ్యధాభరిత గాథలను నవలీ కరిస్తారని ఆశిస్తూ డాక్టర్‌ దిలావర్‌కి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ..
– సోంపాక సీత, 8639311050