న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ కొటాక్ మహాంద్రా బ్యాంక్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలకు ఉదరు కొటక్ రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామాకు సంబంధించిన లేఖను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 2023 డిసెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ముఖ్య వాటాదారుగా కొనసాగనున్నట్లు వెల్లడించారు. తాత్కాలిక ఎండిగా ప్రస్తుత జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గుప్తా వ్యవహరించనున్నారు. డిసెంబర్ వరకు తనకు గడువు ఉన్నప్పటికీ సులువుగా అధికార మార్పిడి జరగాలన్న ఉద్దేశంతో తాను స్వచ్చందంగా తప్పుకుంటున్నానని అన్నారు. 1985లో ఎన్‌బిఎఫ్‌సిని స్థాపించిన ఉదరు కోటక్.. 2003 నాటికి పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాంక్ కార్యకలాపాల్లోకి మార్చారు. 2024 జనవరి 1 తర్వాత కొటక్ బ్యాంక్‌కు కొత్త సిఇఒ నియమతులు కానున్నారని ఆ వర్గాలు తెలిపాయి.