– నేడో, రేపో మరికొంతమంది అధికారుల అరెస్టులు
– యంత్ర పరికరాల చోరీ ఘటనపై పోలీసుల రెడ్ మార్క్
నవతెలంగాణ – గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ)లోని యంత్ర పరికరాల చోరీ కేసులో ఇంజినీరింగ్ అధికారుల గుండెల్లో గుబులు పుడుతోంది. నేడో, రేపో మరి కొంతమంది ఇంజినీరింగ్ అధికారులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కేటీపీపీలోని స్టోర్ రూమ్‌లో జూన్ మొదటి వారంలో చోరీ జరిగింది. ప్రాజెక్టుకు వినియోగించే టర్బైన్ విడి భాగాలు, బాయిలర్, జనరేటర్, బేరింగ్స్, కాపర్ వాల్స్ లాంటి సుమారు రూ.82 లక్షల విలువైన పరికరాలు మాయమయ్యాయి. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు జూన్ 7న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జెన్కో విజిలెన్స్ అధికారులు, డైరెక్టర్లు కేటీపీపీలో పరిశీలించారు. అనంతరం ఇద్దరు సీఐలు, ఒక డీఎస్పీ అధికారితో ప్రత్యేక దన్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. వారు విచారణ చేపట్టగా అవినీతి బాగోతం ఒకొక్కటి వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో కేటీపీపీకి వెల్డింగ్, కట్టింగ్ పనులు చేసే కల్యాణి ఇంజినీరింగ్ వర్క్స్‌కు చెందిన కాంట్రాక్టర్ ఠాగూర్ వద్ద కొన్ని సామాన్లు లభ్యమయ్యాయి. దాంతో ఆయన్ను పోలీసులు గత శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసులో ఆసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(ఏడీఈ) డి. కిరణ్‌కుమార్‌నూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కాగా పోలీసుల విచారణలో మరి కొంతమంది ఇంజినీరింగ్ అధికారులు ఉన్నట్టు సమాచారం. రూ.82 లక్షల దొంగతనం కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జెన్కో అధికారులను సీరియస్‌గా విచారిస్తున్నారు.