కేటీఆర్‌కు రాజకీయ నాలెడ్జ్‌ లేదు

KTR has no political knowledge– అన్న అమిత్‌షాను కలవగానే చెల్లి లిక్కర్‌ కేసు ఆగింది
– దమ్ముంటే దానం, తలసానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయండి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మంత్రి కేటీఆర్‌కు రాజకీయాలపై నాలెడ్జ్‌ ఉందనుకున్నా…మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన తర్వాత ఆయనకు ఏమీ తెలియదని నాకు అర్థమైందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌ అదరణ కోల్పోయిందనడం సిగ్గు చేటన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేటీఆర్‌కు రాజకీయాలపై అనుభవం లేదన్నారు. బానిసత్వ పార్టీ ఎవరిదో తెలుస్తోందన్నారు. మంత్రి కేటీఆర్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్‌ కేసు ఆగిపోయిందని చెప్పారు. ‘మా చెల్లిని అరెస్ట్‌ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి’ అంటూ కేటీఆర్‌ అమిత్‌ షాకు చెప్పారని ఆరోపించారు. కేసీఆర్‌ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్‌ ఏమయింది? దళిత బంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తానన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన్ను బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తెలంగాణ ద్రోహులను తీసేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర ఒక శాతం మాత్రమేనన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్‌ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఒక్కొక్కరికీ రూ.10 కోట్లు ఇచ్చి పంపించారని ఆయన ఆరోపించారు. మేము తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమం చేస్తున్న సమయంలో కేటీఆర్‌ అమెరికాలో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్‌ బయటకు వచ్చి పార్టీ పెట్టారని గుర్తు చేశారు. మేమూ తెలంగాణ కోసం కొట్లాడామని తెలిపారు.సోనియాను ఒప్పించి సాధించామన్నారు. ‘కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్‌ వినాలి. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందంటూ కేసీఆరే అన్నారు. సోనియా పాత్ర లేదంటూ కేటీఆర్‌ అంటున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం చలించి సోనియా తెలంగాణ ఇచ్చింది. సోనియాపై, కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం కేటీఆర్‌కి తగదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిందో చెప్పాలి. ఎన్నికలు వస్తున్నాయనే పూర్తికాకుండానే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు.’ అని విమర్శించారు. దానం నాగేందర్‌ కట్టె పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులను కొట్టారని గుర్తు చేశారు. ఆరేరు కేసీఆర్‌…ఫుట్‌బాల్‌ లాగా తంతాను అన్న తలసాని మంత్రి ఎలా అయ్యాడు?అని నిలదీశారు. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం ఒక్కసారైనా కేసీఆర్‌ మాట్లాడాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర లేకపోతే కేసీఆర్‌ కుటుంబం సోనియాను ఎందుకు కలిశారు? ఎందుకు గ్రూప్‌ ఫోటో దిగారని ప్రశ్నించారు. మహమూద్‌ అలీ, పద్మ దేవేందర్‌రెడ్డిని బానిసలాగ చూసింది నిజం కాదా? మంత్రులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బానిసత్వం కాదా? దట్టీలు కట్టడానికి తప్ప మహమూద్‌ అలీ దేనికి పనికిరాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులవుతారనీ, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఇప్పుడు కేసీఆర్‌, తర్వాత కేటీఆర్‌, ఆ తర్వాత హిమాన్ష్‌ ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.