కుంభం ఘర్‌వాపసీ….?

– రేవంత్‌తో అనిల్‌ కుమార్‌ రెడ్డి భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ను కాదని గులాబీ పార్టీలో చేరిన వెళ్లిన యాదాద్రి- భవనగిరి డీసీసీ మాజీ అధ్యక్షులు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. సోమవారం హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ ఆయన్ను కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలని ఆహ్వానించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో విభేదాల కారణంగా అనిల్‌ కుమార్‌ రెడ్డి ఈ ఏడాది జూలై 24న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టులో ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో భువనగిరి నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డికే ఆ పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. దీంతో అనిల్‌ కుమార్‌ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారనీ, ఆ మేరకు ఆ పార్టీ ముఖ్యనేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నా …తాజాగా ఆయన తిరిగి సొంతగూటికి చేరడం ఖాయమైంది.