కుంజా బొజ్జి, సున్నం రాజయ్యల రాజకీయ వారసుడు పుల్లయ్య

– పోలవరం వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఒకప్పుడు సీపీఐ(ఎం) పార్టీకి కంచుకోటగా ఉన్న భద్రాచలం అసెంబ్లీ స్థానం నుండి అమరజీవులు మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్యల రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న కారం పుల్లయ్య ఈ నెల 30 తేదీన జరగున్న అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ స్థానం సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం గ్రామానికి చెందిన కారం పుల్లయ్య డివిజన్‌ వ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో ముందుండి పోరాటాలు నిర్వహించారు. ప్రస్తుతం పార్టీ మండల కార్యదర్శిగా నియోకవర్గ కో కన్వీర్‌గా పార్టీ భాద్యతలో పాటు గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్వదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ప్రస్తుతం పార్టీలో పూర్తి కాలపు కార్యకర్తగా కొనసాగుతున్న కారం పుల్లయ్య నీతి నిబద్దతను గుర్తించి రాష్ట్ర పార్టీ అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే అభ్యర్దిగా అవకాశం కల్పించింది.
రాజకీయ నేపద్యం : కారం పుల్లయ్య కుటుంబం మొదటి నుండి సీపీఐ(ఎం) మదద్దతుగా కొనసాగేవారు. 2002లో పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడై క్రీయాశీలక సభ్యత్వం తీసుకున్నాడు. నాటి నుండి మారాయిగూడెం, తునికి చెరువు ప్రాంతంలో ఆనాడు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా ఉన్న సున్నం రాజయ్య చేపట్టిన పోడు భూముల ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆనాటి నుండి పార్టీతో పాటు ప్రజా సంఘాల్లో వివిద హౌదాలో పని చేశాడు.
ప్రజా సంఘాల్లో : 2002లో డీవైఎఫ్‌ఐ మండల కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2004లో ప్రజా నాట్యమండలి మండల భాద్యతలు తీసుకుని ఎంతో మంది కళాకారులను తయారుచేశారు. 2007లో వ్యవశాయ కార్మిక సంఘం దుమ్ముగూడెం మండల కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం కారం పుల్లయ్య గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా భాద్యతల్లో ఉన్నారు.
పార్టీలో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2010 జరిగిన డివిజన్‌ మహాసభలో డివిజన్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగాడు. 2014లో పార్టీ భద్రాచలం డివిజన్‌ కార్యదర్శివర్గ సభ్యులుగా, 2017లో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, ప్రస్తుతం మండల కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, భద్రాచలం నియోజకవర్గ కో కన్వీనర్‌గా కొనసాగుతున్నాడు.
పాల్గొన్న పోరాటాలు : ఆనాడు సున్నం రాజయ్య నాయకత్వంలో చేపట్టిన పోడు భూముల పోరాటంతో పాటు డివిజన్‌ వ్యాప్తంగా సాగిన పోడు భూముల పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని సాగిన పోరాటంలో క్రియాశీలకంగా పొల్గొని జైలు నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. అటవీ హక్కుల చట్టం కోసం జరిగిన పోరాటంలో నాయకత్వం వహించాడు. గోదావరి వరద ముంపు భాదితుల సమస్యలపై 2023లో భద్రాచలంలో జరిగిన పాదయాత్రకు నాయకత్వం వహించాడు. గోదావరి వరదల సమయంలో నష్టపోయిన భాధితులకు పార్టీ సహకారంతో అండగా ఉండడంతో పాటు 2022లో గోదావరి ముంపు గ్రామాల ప్రజలకు పార్టీ కార్యాలయంలో పునరావాసా కేంద్రం ఏర్పాటు చేసి సుమారు నెల రోజుల పాటు యలమంచి సీతారామయ్య ట్రస్టు ఆద్వర్యంలో అందించారు.
దీంతో పాటు కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో పరిష్కారం మార్గం చూపేవాడు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో పాటు గిరిజన, గిరిజనేతరులతో మంచి సంబందాలు కలిగిన కారం పుల్లయ్యను చట్ట సభలకు పంపితే ఈ ప్రాంత సమస్యలను చట్ట సభల్లో లేవనెత్తి భద్రాద్రి అభివృద్ధికి కృషి చేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు.