శ్రమతో కూడిన సాహిత్యం రావాలి

దాసోజు లలిత… శ్రమలోనే పుట్టింది. శ్రమిస్తూ పెరిగింది. అందుకే తన చుట్టూ కన్నీళ్లు పెడుతున్న శ్రమజీవుల బాధ, ఆవేదనని కసిగా ప్రశ్నిస్తున్నది. తన అక్షరాలతో వివక్షను ఖండిస్తుంది. వాస్తవాలను ప్రపంచానికి చాటి చెబుతున్నది. వృత్తిలకు నెలవైనా గ్రామమంటే ఆమెకు ప్రాణం. అందుకే ఆమె రాసే ప్రతి అక్షరంలో ఊరి మట్టి వాసన మనల్ని అప్యాయంగా పలకరిస్తుంది. శ్రమ జీవి ఉత్పత్తి సాధనాలు ఇనుమ, రాయి, కర్ర ఇవే ఆమె రచనా వస్తువులు. శ్రమ జీవులను గౌరవించే సమాజం కోసం నిత్యం తపిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
నేను పుట్టింది నల్గొండ జిల్లా, నార్కెట్‌పల్లి మండలం, బ్రాహ్మణ వెల్లెంలో. మా నాన్న పిచ్చయ్యాచారి, కమ్మరి పనిచేసేవారు. అమ్మ జంగమ్మ. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు. నాన్న ఎడ్ల బండి చక్రానికి ఇనుప పట్టాలు వేస్తుంటే నేను కమ్ములు కాల్చడానికి పిడకలు పేర్చే దాన్ని. పనిలో నాన్నకు నేను కుడిచేయి. అలాంటి శ్రామిక కుటుంబంలో పుట్టిన నాకు శ్రమ కొత్త కాదు. ఇంటర్‌ చదివేటపుడు కృష్ణమాచారిని పెండ్లి చేసుకుని కొంతకాలం నల్లగొండలో ఉండి, హైదరాబాద్‌ వచ్చాను. నా సహ చరుడు రచయిత, ఉద్యమ కారుడు. దాంతో మా ఇంట్లో సాహిత్య చర్చలు బాగా జరుగుతుండేవి. పెద్దపెద్ద రచయితలు, ఉద్యమకారులు మా ఇంటికి వస్తుండేవారు. వాళ్ళ చర్చల్లో నేనూ పాల్గొనేదాన్ని. అవి విన్న ప్పుడు మహిళల శ్రమకు సంబంధించిన సాహిత్యం చాలా తక్కువ ఉందనిపించింది. అందు లోనూ ఉత్పత్తి కులాల గురించి అసలు ఎక్కడా రికార్డు చేయలేదు. ఆలోటు భర్తీ చేయడానికి నేనే ఎందుకు రాయకూడదు అనే ఆలోచన వచ్చింది. ముందు కవిత్వంతో మొదలుపెట్టాను. తర్వాత స్పందిం చిన ప్రతి విషయాన్ని వ్యాసాలుగా రాసి పత్రికలకు పంపించేదాన్ని.
శ్రమ రికార్డు కాలేదు
నేను పుట్టింది ఉత్పత్తి కులంలో. ఆ శ్రమను నేను చేశాను, అనుభ వించాను కాబట్టే రాయగలిగాను. చాలా మంది కవులు, రచయితలు, మేధావులు చాలా రచనలు చేశారు. కానీ చేతివృత్తుల శ్రమలు రికార్డు కాలేదు. ముందు ‘ధాతి’ కవిత్వంలో చేతివృత్తుల శ్రమకు సంబం ధించిన అర్థాలు, శబ్దాలు, ధ్వనులు, వస్తువులను రికార్డ్‌ చేశాను. ఇంట్లో మహిళ బానిస పని చేస్తూనే వృత్తి పనుల్లో భాగం అవుతుంది. ఆ మహిళ శ్రమనే ‘ధాతి’ కవిత్వంలో రాశాను. ఉత్పత్తి కులాల శ్రమ గురించి కొంత వరకు కవిత్వ రూపంలో వచ్చింది. అందుకే నేను కథలు, నవలపై దృష్టి పెట్టాను. నేను చదువుకుంది ఇంటర్‌ మాత్రమే. అయితే భాషపై పట్టు ఉంది. శ్రమ నుండే భాష పుట్టింది. శ్రమ చేశాను కాబట్టే అలాంటి పట్టు వచ్చిందని నేను నమ్ముతున్నాను. నా దృష్టిలో చేతివృత్తులే పెద్ద యూనివర్సిటీలు, కర్మాగారాలు.
శ్రమ దోపిడిని రికార్డు చేయాలని
ఊళ్ళో ఏ ఉత్పత్తి వస్తువు కావాలన్నా మా దగ్గరకే వచ్చేవారు. మా అమ్మ చాలా శ్రమించేది. మాకు కొంత వ్యవసాయం కూడా ఉంది. కొలిమి తిప్పడం అంటే చాలా ఇష్టం. నాన్నకు నేను చేసే పని అంటే ఇష్టం. పని చేసినందుకు మాకు ధాన్యం ఇచ్చే వాళ్ళు. అది కూడా సరిగా ఇచ్చేవారు కాదు. భూస్వాములు చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఆ శ్రమ దోపిడిని రికార్డు చేయాలనే రచనలు చేస్తున్నాను.
ఆ ఆశయాలు తీరలేదు
ఏ ఆశయాల కోసమైతే ప్రత్యేక తెలంగాణ పోరాటం చేశామో ఆ ఆశయాలు తీరలేదు. ఎంతో మంది విద్యార్థులు అమరుల య్యారు. నీళ్ళు, నిధులు, నియామకం కోసం పోరాటం జరిగింది. కానీ ఇవేవీ పేద ప్రజలకు అందలేదు. ధరలు పెంచారు. బడులు మూసేస్తున్నారు. మద్యం ఏరులై పారుతుంది. లిక్కర్‌ తాగి పేదలు చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు. పేదల శ్రమను దోచు కుంటున్నారు. బాగా తాగండంటూ 24 గంటలు బార్లు తెరిచి పెడుతున్నారు. 20,30 ఏండ్లు నిండక ముందే చాలా మంది మహి ళలు భర్తలను, పిల్లలు తండ్రులను కోల్పోతున్నారు. రాష్ట్రంలోనే కాదు కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఇలాగే ఉన్నాయి.
ప్రపంచానికి తెలియాలి
ఇప్పటి వరకు రికార్డ్‌ చేయబడని సాహిత్యం, ప్రజల నాలుకలపై ఆడే సాహిత్యం, సామెతులు చాలా ఉన్నాయి. అవి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అవి రికార్డు చేయాలి. అలాగే వృత్తుల్లో దాగి ఉన్న శ్రమను తెలియజేసే శ్రమతో కూడిన సాహిత్యం రావాలి. నా వంతుగా నేను అలాంటి సాహిత్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మహనీయుల జీవిత చరిత్రలు ప్రపంచానికి తెలియాలి. అప్పుడే యువతలో స్ఫూర్తి నిండుతుంది. అలాగే సమాజ మార్పుకై సాహసాలు చేసిన మహిళలు ఎందరో ఉన్నారు. అక్కమహాదేవి, పోతులూరి ఈశ్వరమ్మ, మొల్ల, ఫాతిమాషేక్‌, సావిత్రీబాయి, సంగెం లక్ష్మీబాయి, సదాలక్ష్మి, రాజ్యాంగం రాసిన వారిలో చాలా మంది మహిళలు ఉన్నారు. వీరందరి గురించి ప్రపంచానికి తెలియాలి. అలాగే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వృత్తులు కూడా ఆధునీకరించబడాలి. ఆదరువులు కల్పించాలి. దీనికి దోహదపడే సాహిత్యం రావాలి.
చేయాల్సింది చాలా ఉంది
మహిళలకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీనికోసం అన్ని రంగాలకు సంబంధించిన మహిళలు ఏకమై సమానత్వం కోసం పోరాడాలి. అలాగే రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషించాలి. స్త్రీలకు ఆర్థిక స్వతంత్య్రం వచ్చినపుడే నిజమైన స్వాతంత్య్రం అని నా అభిప్రాయం. నేనింకా చాలా రచనలు చేయాలి. నా వంతుగా చేయాల్సిన పని చాలా ఉంది. అన్ని రంగాలలో ఉన్న జాతి, వర్గ, కుల వివక్షలను జయించే పరిపూర్ణమైన మహిళా రాజ్యాల కోసం పని చేయాలని నా కోరిక.
నా పుస్తకాలకన్నా...
మొదటిసారి 2014లో ‘బతుకమ్మ’ అనే సంకలనం తీసుకొచ్చాను. 2015లో కొలిమిపూలు నవల తెచ్చాను. అలాగే వృత్తి మహిళల చేత రాయించి ‘ఉమ్మనీరు’ అనే కథల పుస్తకం కూడా తీసుకొచ్చాం. ‘తాగలం’ అనే నా సొంత కథలతో ఓ పుస్తకం తీసుకొచ్చాను. అలాగే ‘దాతి’ కవితా సంపుటి కూడా వచ్చింది. ఇంకా వ్యాసాలు చాలా ఉన్నాయి. వీటిని పుస్తకంగా తీసుకురావొచ్చు. అయితే నాకు నా సొంత పుస్తకాలకన్నా ఇతర మహిళలు రాసిన వాటిని సంకలనంగా తీసుకురావడమంటేనే ఇష్టం. అందుకే వాటిపై దృష్టి పెడుతున్నాను.
బహుజన మహిళలకు గుర్తింపు రావాలి
తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీ ఏర్పాటు చేశారు. అందులో మహిళకు ప్రాధాన్యం లేదు. అవార్డులు, గుర్తింపు విషయంలో తెలంగాణ సాహిత్య కారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ విషయంలో కూడా మహిళలు పెద్దగా ప్రాధాన్యం లేదు. ప్రస్తుతం ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. అయితే పల్లె జీవితాలు తెలిసిన వారి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. యూనివర్సిటీల్లో తెలుగు డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. సెమినార్లు పెడుతున్నారు. డిగ్రీ లేదనే ఒకే కారణంతో నాలాంటి వారిని సెమినార్లకు దూరం చేస్తున్నారు. యూనివర్సిటీలే మమ్మల్ని దూరం పెడుతుంటే ఇక అకాడమీలు ఎందుకు దూరం పెట్టవు. అలాగే ఇక్కడ కేంద్ర ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకిస్తూనే అక్కడ అవార్డులు తీసుకుంటున్నారు. ఇదేంటో నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళకు తొత్తులుగా ఉంటున్న వారికి మాత్రమే అవార్డులు ఇస్తున్నారు. గడిల చుట్టూ తిరిగి రాస్తే అది కవిత్వం కాదు. వీటన్నింటిలో మార్పు రావాలి. బహుజన మహిళలకు గుర్తింపు రావాలి.